Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28న గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర హైదరాబాద్లో ముగింపు సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయించాలనీ, గ్రామ పంచాయితీ కార్మికులకు కూడా మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నట్టుగానే జీవో 60 ప్రకారం వేతనాలు. పెంచాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్,అధ్యక్షులు గ్యార పాండు,ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో రద్దు చేసిన పాత కేటగిరీలను పునరుద్ధరించాలని, కోరారు. జీవో51ని సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించాలని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 12న పాలకుర్తినుంచి ఆరుగురు రాష్ట్ర నాయకుల బృందంతో పాదయాత్ర నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ యాత్ర 17 రోజుల్లో 350 కిలోమీటర్లు పూర్తి చేసుకొని 28న హైదరాబాద్కు చేరుకోనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర కొనసాగుతుందనీ, అక్కడ ముగింపు సభ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సభలో సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం సాయిబాబు, మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, వివిధ యూనియన్లు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు.