Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ రాష్ట్ర సెమినార్లో ప్రొఫెసర్ ఖాసీం
నవతెలంగాణ-జనగామ
దేశంలోని పౌరుల మధ్య అసమానతలు సృష్టిస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అకాడమీ అధ్యక్షులు ప్రొఫెసర్ చింతకింది ఖాసిం అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా మనువాదము- రాజ్యాంగము అనే అంశంపై సెమినార్ జరిగింది. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు తూటి దేవదానం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఖాసి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మనువాదాన్ని అమలు చేయాలని కుట్రలు తీవ్రతరం చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ మూలకర్త అయిన గోల్వాల్కర్ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం నాటి నుండి పనిచేశాడని అన్నారు. కామన్ సివిల్ కోడ్ పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి భారత చట్టంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన పరిస్థితుల్లోకి పౌరులు నెట్టివేయబడ్డారని అన్నారు.
దేశవ్యాప్తంగా దళితులు ఆదివాసీలు బహుజనుల మీద దాడులు జరుగుతున్నా అసమానతలు పెరుగుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదు అన్నారు. శూద్రులకు, దళితులకు,స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్న మనుశాస్త్రం అమలు జరిపితే మధ్యయుగాలనాటి సంస్కృతి మళ్లీ వస్తుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఓడించాలంటే మార్కిృజం సిద్ధాంతం పునాదులతోటే సాధ్యమవుతుందని అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్ వెస్లీ టీ స్కైలాబ్ బాబులు మాట్లాడుతూ మూఢత్వ సిద్ధాంతాన్ని పెంచి పోషించే విధంగా పరిపాలన చేస్తున్న బిజెపి విధానాలను పోరాటాల ద్వారా ప్రతిఘటించాలన్నారు. ఈ సెమినార్లో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల శేఖర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పల్లెర్ల లలిత తదితరులు పాల్గొన్నారు.