Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఏపీ సీఎం బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆయనతో పాటు సీబీఐ, వైఎస్ సునీతా వేసిన ఇంప్లీడ్ పిటిషన్లపైనా హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వివేకా హత్య కేసు కీలక దశలో ఉందనీ, పలువురు రాజకీయ పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలున్నాయనీ, ఈ దశలో బెయిల్ ఇవ్వరాదనీ సీబీఐ కోరింది. ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందన్నారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర ప్రముఖుల దగ్గర ఉన్నట్టుగా ఆధారాలున్నాయని సీబీఐ చెప్పింది. కేసు కీలక దర్యాప్తు దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దన్న వినతిని ఆమోదించింది.
మహేశ్వర మెడికల్ కాలేజీ పిటిషన్ కొట్టివేత
పీజీ మెడికల్ కోర్సుల నిర్వహణను పునరుద్ధరించాలంటూ మహేశ్వర మెడికల్ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కుటుంబీకులు నిర్వహించే కాలేజీ ఫేక్ గ్యారెంటీ డాక్యుమెంట్లను సమర్పించడంతో పీజీ కోర్సుల అనుమతిని ఎన్ఎంసీ రద్దు చేసింది. కాలేజీలోని సీట్ల ఆధారంగా బ్యాంక్ గ్యారెంటీని అందించాలి. అనుమతి లభించాక మహేశ్వర కళాశాల యాజమాన్యం బ్యాంక్ ఆఫ్ బరోడా నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించినట్టు ఎన్ఎంసీకి తెలిసింది. ఈ నేపథ్యంలో పీజీ మెడికల్ కోర్సుల అనుమతిని ఉపసంహరించుకున్న ఎన్ఎంసీ అక్కడి విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఈ చర్యలను కాలేజీ యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేస్తే సింగిల్ జడ్జి డిస్మిస్ చేశారు. దీనిని సవాల్ చేసిన అప్పీళ్లను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి ఆ అప్పీల్‌ను కొట్టేసింది.
నేటినుంచి 28 జిల్లాల్లో డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లు
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మద్యపానం, ధూమపానం, ఇతర దురలవాట్లను మాన్పించేందుకు డీ ఎడిక్షన్ సెంటర్లను ప్రారంభిస్తామనీ, ఇవన్నీ మంగళవారం నుంచి పనిచేస్తాయనీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ డీ ఎడిక్షన్, లిక్కర్ డీ ఎడిక్షన్ కేంద్రాల ఏర్పాటు ఉత్తర్వుల్ని అమలు చేయడం లేదని సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ వేసిన రిట్లో ప్రభుత్వం ఈ వివరాలు తెలియజేసింది. దీంతో వాటి అమలుపై నివేదిక అందజేయాలనీ, విచారణను మార్చి ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ ఎస్ నందా సోమవారం ప్రకటించారు. ప్రభుత్వ చర్యలపై మీడియాలో ప్రచారం చేయాలని ఆదేశించారు.