Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రటి ఎండలో బారులు తీరుతున్న రైతులు
నవతెలంగాణ - చెన్నారావుపేట
రైతులకు కావాల్సిన ఎరువుల విషయంలో పీఏసీఎస్ సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దాంతో రైతులు ఎర్రటి ఎండలో యూరియా కోసం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకు వరంగల్ జిల్లా చెన్నారేవుపేట మండలమే నిదర్శనం. యాసింగి వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే కొనసాగుతున్న మొక్కజొన్న పంటలకు యూరియా వేయడానికి యూరియా కోసం నానా తంటాలు పడుతున్నారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో లేవు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రం నుంచి ఓ ప్రయివేటు ఫర్టిలైజర్ షాపులో ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న రైతులు యూరియా కోసం బారులు తీరి.. బస్తాకు రూ.30 నుంచి రూ.40 అధికంగా చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు లక్ష్యమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు మాత్రం రైతులకు ఎరువులు అందుబాటులో లేకున్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. దాంతో అన్నదాతలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సకాలంలో ఎరువులు రైతులకు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు వేడుకుంటున్నారు.