Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను కఠినంగా శిక్షించాలి
- విద్యాసంస్థల్లో పర్యవేక్షక కమిటీలు, టోల్‌ఫ్రీనెంబర్ ఏర్పాటు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుని మరణించడం అత్యంత బాధాకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్ కేంద్రాలు, టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని తోటి విద్యార్థులు ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు.
ఫిర్యాదులు వస్తే అలసత్వం తగదు
ప్రతి విద్యాసంస్థల్లోనూ ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని తమ్మినేని సూచించారు. 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం, 2009లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నప్పటికీ ఈ కృషి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో 32 ర్యాగింగ్ కేసులు యూసీజీకి వచ్చినట్టు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖనే పేర్కొన్నదంటే ర్యాగింగ్ ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి పూనుకోవడంలో సంబంధిత బాధ్యులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనీ, ఇది తగదని హెచ్చరించారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియో ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపర్చడంలేదని విమర్శించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించాలనీ, యాంటీ ర్యాగింగ్ స్వ్కాడ్లను ఏర్పాటు చేసి ఆయా నెంబర్లను బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రతి విద్యా సంస్థలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులతోపాటు, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్‌లను కూడా భాగస్వాములను చేసి తరచుగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.