Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళ్లు కడిగినట్టు ఫొటోలు దిగితే సరిపోదు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నది ఆకలి పోరాటం అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. ఇది అంతం కాదు..ఆరంభం మాత్రమే అని కేంద్ర, రాష్ట్ర పాలకులకు హెచ్చరికలు పంపారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నది. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన చేపట్టారు.
- పారిశుధ్య కార్మికుల పొట్టలు నింపే చర్యలు తీసుకోండి
- జీపీ కార్మికులపై ఎందుకింత వివక్ష
- అరకొర జీతాలతో ఎట్టా బతకాలో కేంద్ర, రాష్ట్ర పాలకులే చెప్పాలి : ఎం.సాయిబాబు
- జీపీ కార్మికులు జీతాలు పంచుకోవాలనటం దుర్మార్గం : చుక్కరాములు
- మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి : పాలడుగు భాస్కర్
- వేలాది మంది పంచాయతీ కార్మికులతో ప్రదర్శన, బహిరంగ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇందిరాపార్కు వద్ద వేలాది మందిగ్రామ పంచాయతీ కార్మికులతో బహిరంగసభ నిర్వహిం చారు. సభలో ఎం.సాయిబాబు మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అంటూ మోడీ పొరకబట్టి ఊడ్చినట్టు, పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగినట్టు ఫొటోలకు ఫోజులిచ్చాడేగాని వారి జీవితాల బాగు కోసం ఒక్క నిర్ణయమైనా తీసుకున్నాడా? అని ప్రశ్నించారు. ప్రతి మనిషి రూ.100 పన్ను కడితే అందంతా కేంద్రానికి పోయి తిరిగి వెనక్కి రూ.3 మాత్రమే వస్తున్నదనీ, మిగతా డబ్బులన్నింటినీ కార్పొరేట్లకు మోడీ సర్కారు కట్టబెడుతున్నదని విమర్శించారు. సాటి మనుషులను గౌరవించలేనీ, మూడుపుటలా బువ్వ తినేలా జీతాలివ్వలేని పాలకులు ఎన్ని గుడులు కడితే ఏందీ? ఎన్ని పూజలు చేస్తే ఏందీ అని ప్రశ్నించారు. దేశంలో ప్రతి వంద మంది మహిళల్లో 50 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు వస్తున్న జబ్బులన్నీ పాలకుల విధానపరమైన లోపాలవల్లనేనని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తే ఆ కుటుంబం కాస్త పండ్లు, బలమైన పౌష్టికాహారం తీసుకునే వెసులుబాటు ఉంటుందనీ, ఫలితంగా ఆ కుటుంబంలో అనారోగ్యాలపాలయ్యే వారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. పది మంది కార్మికులు పనిచేస్తేనే పీఎఫ్ ఇవ్వాలని చట్టాలు చెబుతుంటే ..రాష్ట్రంలో 50 వేలమందికిపైగా పనిచేస్తున్న జీపీ కార్మికులకు పీఎఫ్ ఎందుకివ్వరని ప్రశ్నించారు. కార్మికుల హక్కులను హరించే కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో తాను చేసే యుద్ధంతో ప్రతిఒక్కరూ కలిసిరావాలనీ సీఎం కేసీఆర్ అంటున్నాడు సరే...జీతాల్లేకుండా, సరైన ఆహారం తీసుకోలేని స్థితిలో పంచాయతీ కార్మికులు ఎలా రాగలుగుతారని ప్రశ్నించారు. తక్షణమే వారిని పర్మినెంట్ చేసి కనీస వేతనం ఇస్తే వారికి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందనీ, మీరు చేసే యుద్ధంలో వారూ కలిసొస్తారని సీఎం కేసీఆర్కు సూచించారు. బంగారు తెలంగాణ కాదు కార్మికులకు బుక్కెడు బువ్వ పెట్టే తెలంగాణను నిర్మించాలని కోరారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ...ఆరేడు మంది పనిచేస్తే నలుగురికి జీతాలిచ్చి వాటినే పంచుకోవాలని చెప్పటం దుర్మార్గమని విమర్శించారు. మహనీయుల విగ్రహాలు పెడితే సరిపోదనీ, అట్టడుగు సామాజిక తరగతులకు చెందిన పంచాయతీ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించి జీవితాలు మెరుగుపర్చితేనే సామాజిక న్యాయం దక్కుతుందని అన్నారు. పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ఎర్రజెండా ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ...ఎర్రటెండలో కాళ్లకు బొగ్గలొచ్చినా...నీరసపడ్డా...ఆగకుండా నడిచింది మేమయితే...మమ్ముల్ని నడిపించింది ముమ్మాటికీ పంచాయతీ కార్మికులేనని నొక్కి చెప్పారు. ఏడెనిమిది నెలల నుంచి జీతాలివ్వకుంటే పంచాయతీ కార్మికులు ఎలా బతుకుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 12,700 జీతం పంచాయతీ కార్మికులకు ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలని మంత్రి ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. ఇచ్చే రూ.8,500 జీతాన్ని ఇద్దరు, ముగ్గురు కార్మికులను పంచుకోవాలని చెబుతున్నంది వాస్తవం కాదా? అని నిలదీశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఇస్తున్నట్టుగా లక్షలకు లక్షల జీతం అవసరం లేదనీ, పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అడుగుతున్నామని చెప్పారు. ఇలా అడగటం కూడా నేరమేనన్నట్టుగా పాలకులు చూడటం దారుణమని పేర్కొన్నారు. కార్మికులకు భారంగా మారిన, చావులకు కారణమవుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో ఓ పంచాయతీ కార్మికుడు కాలు పోగొట్టుకుని వైద్యం కోసం ఏడు లక్షలు ఖర్చు చేస్తే సర్కారు నయా పైసా సాయం చేయని తీరును ఎండగట్టారు. కార్మికులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ లోపే పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, లేనిపక్షంలో పంచాయతీ కార్మికులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఈ సభకు పాదయాత్ర బృంద సభ్యుడు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గ్యార పాండు అధ్యక్షత వహించారు. ఈ సభలో పాదయాత్ర బృంద సభ్యులు, ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, ఇతర బృంద సభ్యులు గణపతిరెడ్డి, వినోద్, మహేశ్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.సుధాకర్, యాత్ర కో-ఆర్డినేటర్ జె.వెంకటేశ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, పి.జయలక్ష్మి, జె.మల్లిఖార్జున్, కె.ఈశ్వర్రావు, బి.మధు, రాష్ట్ర కార్యదర్శులు పి.శ్రీకాంత్, కె.రమేశ్, టీయూ సోషల్మీడియా ఇన్చార్జి యాటల సోమన్న, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రాకేశ్ మాష్టార్
పాదయాత్ర ముగింపు సభకు ప్రముఖ డ్యాన్స్మాష్టర్ రాకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గాయకులు ఆనంద్, చంద్రమౌళి నేతృత్వంలో ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన..'కార్మికులకు అండగా సీఐటీయూ జెండా..' పాటకు రాకేశ్ మాష్టర్ స్టెప్పులు వేసి అలరించారు. తన పదునైన వాగ్దాటితో 'పదండి ముందుకు పదండి ముందుకు పంచాయతీ కార్మికులరా పదండి ముందుకు' అంటూ ఉత్తేజపర్చారు. గుక్కతిప్పుకోకుండా రైతులు, కార్మికుల శ్రమ విడమర్చి చెప్పడంతో అందరూ ఫిదా అయిపోయారు. సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది.