Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024లో మళ్లీ గెలిస్తే సీఏఏ అమలు
- రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి
- హిందూత్వ రాష్ట్రమే వాటి లక్ష్యం
- మనువాదాన్ని ఐక్యంగా ప్రతిఘటించాలి
- ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజాన్ని కాపాడుదాం : సెమినార్లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ సర్కార్ బుల్డోజర్ను ఆపే శక్తి ప్రజలకే ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. 2024లో మళ్లీ బీజేపీ గెలిస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమల్లోకి వస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగ హక్కులపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతోపాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని విమర్శించారు. దేశాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపైనా ఉందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, ఫెడరలిజాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని హుస్సేనిఆలంలో 'రాజ్యాంగ హక్కులు-సవాళ్లు'అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన బృందాకరత్ మాట్లాడుతూ బ్రిటీష్ రాజ్యం పోయిందనీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయ్యిందనీ చెప్పారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అయితే విదేశీ శక్తులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం లేదన్నారు. రాజ్యాంగంపై స్వదేశీ శక్తులైన కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించాలన్న డిమాండ్ సమాజం నుంచి వస్తున్నదని చెప్పారు. దాన్ని రక్షించేందుకు దేశ ప్రజలంతా అండగా ఉంటున్నారని అన్నారు. కానీ 1925లో ఏర్పడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదని వివరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మనుస్మృతి ఈ దేశ రాజ్యాంగమంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటించిందని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ దేశ సంపద ప్రజలందరిదంటూ రాజ్యాంగం చెప్తుందన్నారు. వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. అందుకే ఈ రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తున్నదని విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం సాగిందన్నారు. ఢిల్లీలో షాహీన్బాగ్తోపాటు హైదరాబాద్‌లోనూ ఉద్యమించారని గుర్తు చేశారు. ఇది ముస్లింలపైనే కాకుండా దేశంపైనా, ప్రజలపైనా జరిగిన దాడి అన్నారు.2024లో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఏఏను అమల్లోకి తెస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూత్వ రాష్ట్రం ఏర్పాటు చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమని వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. హర్యానా ప్రభుత్వం గోరక్షక దళాల పేరుతో భజరంగ్‌దళ్ వారికి లైసెన్స్‌లు ఇచ్చిందని అన్నారు. ఇద్దరు ముస్లిం యువకులను బతికుండగానే కాల్చిచంపారని చెప్పారు. దేశంలో దళితులు, గిరిజనులపైనా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదనీ, సమరయోధుల్లేరనీ, ఎవరూ జైలుకు వెళ్లలేదనీ అన్నారు. ప్రశ్నించే వారిని అణచివేసేందుకు ఉపా చట్టాన్ని తెచ్చిందన్నారు. ఎనిమిదేండ్లలో ఆ చట్టం కింద అరెస్టు చేసిన వారికి బెయిల్ ఇవ్వడం లేదని చెప్పారు. 10,500 మందిని అరెస్టు చేస్తే, వారిలో 200 మందికే శిక్ష పడిందని గుర్తు చేశారు. దేశంలో అధిక ధరలతో ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతున్నదని అన్నారు. కానీ అదానీ రోజుకు రూ.1,216 కోట్లు సంపాదిస్తున్నారని వివరించారు. కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతున్నదని చెప్పారు. ఈ బడ్జెట్లో ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికుల కోసం సరిపోయినన్ని నిధులు కేటాయించలేదని విమర్శించారు. కానీ మోడీ పాలనలో ఒక శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. మోడీ ప్రభుత్వ మతతత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ విధానాలను తిప్పికొట్టేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
బీజేపీ, ఎంఐఎంను ఓడించడమే లక్ష్యం : ఎండీ అబ్బాస్
ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎంను ఓడించడమే లక్ష్యమని అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శి ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. బండి సంజరు, ఇతర బీజేపీ నాయకులు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి దేవాలయానికి వచ్చి హైదరాబాద్ పేరును మారుస్తామంటున్నారని చెప్పారు. అయితే పేర్లు మార్చొద్దంటూ సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. పేర్లు మారిస్తే ఉద్యోగాలొస్తాయా?, మౌలిక వసతులు మెరుగవుతాయా?, నాణ్యమైన విద్య, వైద్యం అందుతుందా?, ఇండ్లు, ఇండ్ల స్థలాలు వస్తాయా?అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 17 నుంచి హన్మకొండలో సీపీఐ(ఎం) జాతాను ప్రారంభిస్తుందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం, పోడు భూములకు పట్టాలు వంటి సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పాతబస్తీలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలున్నా అభివృద్ధి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. స్వచ్ఛమైన తాగునీరు లేదనీ, ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల్లో సౌకర్యాల్లేవని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే సీపీఐ(ఎం)ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత, సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు విఠల్, కోటయ్య, మీనా, పి నాగేశ్వర్రావు, అబ్దుల్ సత్తార్, సామాజిక కార్యకర్తలు ఇక్బాల్ జావీద్, నయీముల్లా షరీఫ్, సీనియర్ అడ్వకేట్ అబ్దుల్ ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.