Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ
- నేడు మహాప్రదర్శన, బహిరంగ సభ, హాజరు కానున్న బృందాకరత్
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వేదికైంది. బుధవారం ప్రారంభం కానున్న ఈ మహాసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉద్యమాల గడ్డగా పేరొందిన మిర్యాలగూడలో తొలిసారిగా గిరిజన సంఘం మహాసభ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా గిరిజనులు ఉండటం మిర్యాలగూడ కేంద్రంగా మహాసభ జరగడం అత్యంత ప్రాధాన్యత నెలకొంది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఈ మహాసభ జరగనుంది. మొదటి రోజు బుధవారం ఉదయం 10 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి ఎన్నెస్పీ క్యాంపు మైదానం వరకు మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. సుమారు 2000 మంది గిరిజన సంస్కృతి సంప్రదాయ దుస్తులతో కవాతులో పాల్గొంటారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు బృందాకరత్, మాజీ ఎంపీ, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మెన్ మీడియం బాబురావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరుకానున్నారు. సాయంత్రం స్థానిక ఏఆర్సీ ఫంక్షన్హాల్లో ప్రతినిధుల మహాసభ ప్రారంభమవు తుంది. రెండు, మూడు తేదీల్లో ప్రతినిధుల సభ కొనసాగుతుంది. ఇందులో సుమారు 1000 మంది పాల్గొననున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణ రూపొందించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
మిర్యాలగూడ పట్టణంలోని నలుమూలల్లో పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడరాతలతో అలంకరించారు. ప్రధాన కూడల్లో పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణ ముఖద్వారంలో తోరణాలతో అలంకరించారు. సాగర్ రోడ్డు వెంబడి డివైడెర్ల పోల్స్‌పై గిరిజన జెండాలను కట్టారు. స్థానిక ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో బహిరంగ సభ కోసం ప్రత్యేక షామియాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సభకు వచ్చే వాహనలను ఫ్లైఓవర్ బిడ్జి వరకు వెళ్లేందుకు అణువుగా ఏర్పాట్లు చేశారు.
బహిరంగ సభను జయప్రదం చేయండి:జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడలోని ఎన్నెస్పీ క్యాంపులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే గిరిజన సంఘం మహాసభ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం బహిరంగ సభాస్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి ఒకటి నుంచి మూడ్రోజులపాటు మిర్యాలగూడలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభ జరగనుందని చెప్పారు. అందులో భాగంగా ఒకటో తేదీన మహా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాల నుంచి గిరిజనులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, జిల్లా అధ్యక్షులు మూడావత్ రవినాయక్, బాబునాయక్, నాగేశ్వర్ నాయక్ తదితరులు ఉన్నారు.