Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటినుంచి కొంటున్నాం
- డిస్కంలపై భారం అయినా తప్పట్లేదు
- రాష్ట్రంలో కరెంటు డిమాండ్ పెరిగింది : టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మంగళవారం విద్యుత్ డిమాండ్ 14,794 మిలియన్ యూనిట్లకు చేరితే, 290 మి.యూ., సరఫరా చేశామని వివరించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై మంగళవారంనాడాయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాదికంటే ఈసారి 30 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యవసాయరంగానికి దాదాపు 30 శాతం, పరిశ్రమలకి 20 శాతం వినియోగం పెరిగిందని తెలిపారు. మార్చి నెలలో 300 మి.యూ., తో 16 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ వస్తుందని అంచనా వేసినట్టు ఈ సందర్భంగా ప్రభాకరరావు తెలిపారు. ఎన్టీపీసీ నుంచి ఏడాది కిందే విద్యుత్ సరఫరా రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రాలేదన్నారు. కరెంటు కొనుగోలుకు ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు ఖర్చు అయ్యాయనీ, రానున్న రోజుల్లో మరో రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామన్నారు. సీఎం కేసీఆర్ డబ్బుకు ఇబ్బంది లేదనీ, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారని వివరించారు. నవంబర్లోనే ఎన్టీపీసీ ఒక్క యూనిట్ కమిషన్ చేయాల్సి ఉందనీ, ఇప్పటికీ రానందున ఇబ్బందులు ఎదురై, పవర్ ఎక్స్చేంజీలో విద్యుత్ కొంటున్నామని తెలిపారు. దీనివల్ల డిస్కంలపై ఆర్థికభారం పడుతున్నా, వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా సరఫరా చేస్తున్నామని వివరణ ఇచ్చారు.