Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటా రూ.21,625
- దేశంలోనే ఇదే అత్యధిక ధర
- రైతును సన్మానించిన మార్కెట్ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారానికి రికార్డ్ స్థాయిలో ధర పలికింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక గ్రామానికి చెందిన రైతు ఎం.రాంబాబు మంగళవారం ఖమ్మం వ్యవసాయం మార్కెట్కు కొత్త తేజ రకం మిర్చిని 34 బస్తాలు తీసుకొచ్చారు. మొత్తం 40వేల మిర్చి బస్తాలు వచ్చాయి. అందులో రాంబాబుకు చెందిన 34 బస్తాల మిర్చిని పాకాల ఉమామహేశ్వరరావు కమీషన్ మర్చంట్ నుంచి వాసవి ట్రేడింగ్ కంపెనీకి చెందిన ప్రొప్రైటర్ సుందరరావు జెండా పాటగా క్వింటా రూ.21,625 పెట్టి కొనుగోలు చేశారు. ఈ ధర భారతదేశంలోనే అత్యధిక రికార్డ్ ధర అని వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం తెలిపారు. సోమవారం ఇదే మార్కెట్లో కొత్త తేజ రకం మిర్చి క్వింటా రూ.20,200 పలకగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.1425 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతు రాంబాబును వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత స్వీట్ తినిపించి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దోరేపల్లి శ్వేత మాట్లాడుతూ.. ఐదు జిల్లాల రైతులకు ఆదెరువుగా ఉన్న ఖమ్మం మార్కెట్లో మంచి ధర రావడం సంతోషంగా ఉందన్నారు. రైతులు నాణ్యమైన పంటలు దిగుబడి చేయడం ద్వారానే రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయన్నారు. ఖమ్మం రైతుల పంటకు భారతదేశంలోనే రికార్డు స్థాయిలో ధర రావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్ సహకారంతో మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ గ్రేడ్ టు అధికారి, అసిస్టెంట్ సెక్రటరీ నిర్మల, మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వరరావు, కార్యదర్శి సతీష్, దిగుమతి శాఖ అధ్యక్షులు దిరిశాల వెంకటేశ్వర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ పాల్గొన్నారు.