Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగ్ మార్కింగ్ పనులు షురూ
- రాత్రుల్లో స్పష్టంగా కనిపించేలా ..
- రెట్రో రిఫ్లెక్టివ్ షీట్‌తో అల్యూమినియం బోర్డులు
- హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతున్న 31 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయింది. ఇందుకు సంబంధించిన పనులను హెచ్ఏఎంఎల్ అధికారులు ఒక్కొక్కటిగా వేగవంతం చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన అనంతరం జనరల్ కన్సల్టెన్సీల నియామకం, స్థల సేకరణతో వీలైనన్ని ప్రయివేటు ఆస్తుల సేకరణ తగ్గించుకునేలా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్ల బృందంతో కలిసి ప్రత్యక్షంగా తనిఖీలు, రూట్ మ్యాప్‌పై కసరత్తు.. అలైన్మెంట్ ఖరారు కోసం కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్ కోసం సర్వే పూర్తి చేశారు. గ్రౌండ్ అలైన్మెంట్లో పెగ్ మార్కింగ్ కూడా మొదలైందని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. రోడ్డుపై సంప్రదాయ ఇంజినీరింగ్ పెగ్ మార్కులే కాకుండా.. రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించడానికి రెట్రో రిఫ్లెక్టివ్ షీట్‌తో కూడిన అల్యూమినియం బోర్డులు పెట్టనున్నారు. ఇది మెట్రో చైనేజీని సూచిస్తుందని.. అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రారంభ స్థానం నుంచి నిర్దిష్ట దూరాన్ని సూచిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
వంద మీటర్లకు.. అర కిలోమీటర్‌కు బోర్డులు
ప్రతి 100 మీటర్లకు 0.1 కి.మీ., 0.2 కి.మీ..ఇలా చిన్న సైజు బోర్డులు వేస్తుండగా, ప్రతి అర కిలోమీటర్‌కు పెద్ద బోర్డులు పెడుతున్నారు. ఈ బోర్డులు రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వరకు, ఖాజాగూడ రోడ్డులోని ఐటీ టవర్స్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు సెంట్రల్ మీడియన్‌లో పెడుతున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్పీఏ(అప్పా) జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణలో ఉండటంతో వాటిని ఫుట్‌పాత్ వైపు ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్ట్రెచ్‌లో సెంట్రల్ మీడియన్ లేదు. అయితే, ఎయిర్పోర్ట్ మెట్రో పిల్లర్లు ఓఆర్ఆర్ వెంట నానక్‌రామ్‌గూడ జంక్షన్, టీఎస్పీఏ జంక్షన్ మధ్య విస్తరించిన సర్వీస్ రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.