Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగవైకల్యానికి పేదరికమే కారణం : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య
నవతెలంగాణ-ముషీరాబాద్
పేదరికమే అంగవైకల్యానికి ప్రధాన కారణమని.. పేదరిక నిర్మూలనకు బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిధులు కేటాయించడం లేదని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య ప్రశ్నించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా 'కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ - వివిధ రంగాలపై ప్రభావం' అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, పైగా పన్నుల భారం మోపుతున్నారన్నారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతున్నా బడ్జెట్లో నిధులు మాత్రం కేటాయించలేదన్నారు. ప్రజల ఆదాయం పెంచేందుకు కనీస వేతనాలు పెంచాలని కోరారు. అదానీ, అంబానీల ఆదాయం పెంచడమే ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని.. తద్వారా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. పేదలు వినియోగించే రైల్వేలను ప్రయివేటీకరణ చేసే యత్నం చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎంత మంది వికలాంగులకు ఇండ్లు కట్టించారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మానసిక వికలాంగుల సంక్షేమం కోసం, పునరావాస చట్టం అమలు కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు.
ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసిందని తెలిపారు పెన్షన్ పెంపు కోసం బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు స్వయం ఉపాధి రుణాలు, వివాహ ప్రోత్సాహకం పరికరాల పంపిణీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు జయరాజు, దశరథ్, సహాయ కార్యదర్శి వి.ఉపేందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు సురుపంగ ప్రకాష్, బొల్లెపల్లి స్వామి, రంగారెడ్డి, భుజంగారెడ్డి, రాములు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.