Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట ఇచ్చా.. ట్యాబ్‌లు పంపిణీ చేశాం
- విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలి: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో 26వేల ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తామని చెప్పార. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 2వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్నందున రాబోయే మూడు నెలలు బాగా చదువుకొని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌ల్లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గానికి కూడా 3వేల ట్యాబ్‌లు అందిస్తామన్నారు. రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తే తమకు సంతోషం కలుగుతుందన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని ఆకాష్ బై జూస్ సాఫ్ట్వేర్ ట్యాబ్‌లు అందజేస్తున్నామన్నారు. ఈ ట్యాబ్‌ల ద్వారా పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్‌ను కూడా అందజేస్తున్నట్టు తెలిపారు. రూ.10వేల విలువగల ట్యాబ్, రూ.76వేల విలువగల మెటిరీయల్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎల్లారెడ్డిపేట జల్లా పరిషత్ పాఠశాల భవనం రూ.7కోట్లతో అద్భుతంగా నిర్మాణం అవుతోందని, 2, 3నెలలో ప్రారంభిస్తామన్నారు. జూనియర్ కాళశాల గ్రౌండ్ అనుకున్నట్టు లేదని, ఈ గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా తీర్చిద్దిదుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఐజీ రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్రావు, జల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సింగిల్ విండో చైర్మెన్ గుండారపు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.