Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులను మూడేండ్లుగా ఎందుకు నియమించలేదో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. ఆ పోస్టుల భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ నగరానికి చెందిన గణేశ్‌రావు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించింది. ఈ కేసు విచారణ వాటి నియామకాల కొనసాగింపునకు అడ్డంకి కాదని చెప్పింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది.
షరతుల్ని అమలు చేయాలి...
అఫిడవిట్ దాఖలుకు షర్మిలకు ఆదేశం
మహబూబాబాద్‌లో తాను చేస్తున్న పాదయాత్రను పోలీసులు రద్దు చేశారంటూ తెలంగాణ వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు విధించిన షరతులను ఉల్లఘించేలా ప్రసంగాలు ఎందుకు చేశారో చెప్పాలని ఆమెను హైకోర్టు ఆదేశించింది. షరతులను ఉల్లంఘించబోమని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాజకీయ నేతలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ప్రజలకు ఏమి ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించింది. షర్మిల మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత హైకోర్టు పైవిధంగా ఆదేశించింది. విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
ముసద్దీలాల్ జ్యుయలర్స్ కేసులో ఈడీ అప్పీల్
ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయలర్స్‌లో ఈడీ సోదాలు చేసి జప్తు చేసిన ఆభరణాలను, క్యాష్‌ను తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌పై డివిజన్ బెంచ్ స్టేటస్కో విధించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌ను ఈడీ సవాల్ చేసింది. ఈడీ విచారణలో ఉండగా జప్తు చేసిన వాటిని అప్పగించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదన్న అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది.
పట్టాలివ్వొద్దు .హైకోర్టును ఆశ్రయించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
అటవీ భూముల్ని సాగు చేసుకునే వారికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి హైకోర్టును ఆవ్రయించారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీల కంటే ఇతరులే ఎక్కువ ప్రయోజనం పొందుతారనీ, వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రయోజనం జరుగుతుందని తెలిపారు. 2.41 లక్షల ఎకరాలు ఆక్రమించుకున్న వలసదారుల వశం అవుతాయ న్నారు. 2021లో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేశారు.
దొరైసామి తొలగింపు సబబే
ముగ్గురు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారనే కేసులో గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ దొరైసామి భాస్కరన్ కృష్ణగిరిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. శాఖాపరమైన విచారణ చేయలేదని చెప్పి సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని సింగిల్ జడ్జి గతంలో రద్దు చేశారు. దీనిపై ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ సమర్ధించింది. లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్ఆర్ మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం చట్టబద్ధమేనని తేల్చింది.
ఆర్ఎస్ఎస్ ప్రదర్శనకు అనుమతి
భైంసాలో మార్చి 5న ఆర్ఎస్ఎస్ ప్రదర్శనకు హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే ప్రదర్శనలో 500 మందికి మించరాదనీ, నేరచరిత్ర ఉన్న వారు పాల్గొనరాదనీ, మసీదు, ఇతర సున్నిత ప్రదేశాల వద్ద ప్రదర్శన చేయరాదని షరతులు విధించింది. బైంసా ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సాదుల కృష్ణదాస్ వేసిన పిటిషన్లో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.