Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశప్రగతికి శాస్త్రరంగాల అభివద్ధే కీలకమని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక (జేవీవీ) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సైన్సు - సమాజం - శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా సభల్లో వారు మాట్లాడుతూ దేశంలో శాస్త్రరంగాలు అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ దిశగా జేవీవీ చేస్తున్న కషిన వారు అభినందించారు. నారాయణగూడ రెడ్డి మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పోషకాహార శాస్త్రవేత్త, ఎన్ఐఎన్ మాజీ సంచాలకులు డా.శశికరణ్, బోరబండ తెలంగాణ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, బాగ్ లింగంపల్లి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా.సోమ మర్ల, నాచారం సెయింట్ పాయుస్ పీజీ కళాశాలలో ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ రాధ (సీసీఎంబీ), హిమాయత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర ఆచార్యులు డాక్టర్ రుక్మిణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్‌ను దేశ ప్రగతికి మాత్రమే వాడుకోవాలనీ, కాని నేడు వ్యాపార వర్గాలు తమ లాభాల కోసం సైన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వ్యవసాయ రంగంలో బీటీ విత్తనాల, వంగడాల ప్రయోగం సైన్స్ దుర్వినియోగానికి తాజా ఉదాహరణ అని స్పష్టం చేసారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికలను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నందువల్లే పర్యావరణ మార్పులు ప్రమాదకర స్థాయిల్లో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కూడా విచక్షణారహితంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అనేక పట్టణాలు నేడు నీట మునుగుతున్నాయని హెచ్చరించారు. వీటన్నింటిని అధిగమించాలంటే విద్యార్థుల, ప్రజా చైతన్యమే పరిష్కారమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఎంతో విపులంగా సమాధానమిచ్చారు.ఈ సభల్లో జేవీవీ రూపొందించిన సైన్స్ క్యాలెండర్ 2023ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వర రావుతో పాటు జేవీవీ నాయకులు ప్రొఫెసర్ బీ.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ ఆదినారాయణ, రాజా, ఛాయా మోహన్, ప్రొ కె.విజయలక్ష్మీ, నగర నాయకులు సీహెచ్.చంద్రశేఖర రావు, మాణిక్యాల రావు, విద్యాసాగర్, అల్తాఫ్, నరేంద్ర, జతీన్ ఆయా విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.