Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విత్తనాలు, నూనెలు కల్తీ చేస్తే పీడీ యాక్ట్
- 'విజయ' ఉత్పత్తుల మార్కెటింగ్ పెంచండి
- వ్యవసాయశాఖపై సీఎస్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో నకిలీ విత్తనాల మార్కెటింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అధికారులను ఆదేశించారు. అలాగే నకిలీ వంటనూనెల తయారీ, విక్రయాలపై దృష్టి సారించాలనీ, అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌తో పాటు చట్టపరంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని చెప్పారు. నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్న 551 మందిని అరెస్ట్ చేసి 347 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిలో 16 మందిపై పీడీ చట్టం కేసులు పెట్టి, 11,872 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బుధవారంనాడిక్కడి బీఆర్కే భవన్లో వ్యవసాయ శాఖపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ కమీషనర్ హనుమంతరావు, మార్కెటింగ్, సహకారశాఖ, ఆయిల్ ఫెడ్ , హాకా, గిడ్డంగులు, ఆగ్రోస్ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ నూనె ఉత్పత్తుల కంపెనీలతో పాటు కల్తీ నూనెలు చెలామణిలో ఉన్నాయనీ, వీటిని నిరోధించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా కల్తీ రహిత విజయ నూనె ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తృతం చేయాలని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేయాలనీ, పండ్లను సేంద్రియ పద్దతిలో మాగపెట్టడం, వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు క్యాంపస్ నియామకాలను కల్పించడం లాంటి వినూత్న విధానాలు అమలు చేయాలని అన్నారు. రైతులకు సాగునీటి సౌకర్యం, రైతు బంధు, యాంత్రీకరణ, రైతుభీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు తదితర అంశాల అమల్లో ఎక్కడా లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనీ, 56.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వివరించారు. అగ్రి స్టార్టప్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డిజిటల్ సర్వీసుల అందుబాటు కోసం చీఫ్ సెక్రటరీ చైర్ పర్సన్‌గా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామనీ, దీనిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, రెవిన్యూ శాఖ కార్యదర్శి, ఐటి శాఖ కార్యదర్శి ఉంటారని తెలిపారు. కూరగాయల పెంపకంపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు.