Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూకే నుండి వచ్చిన వైద్య బృందం సహకారంతో చికిత్స
- మంత్రి హరీశ్‌రావు ఆహ్వానం మేరకు వచ్చిన బ్రిటన్ బృందం
- నాలుగు రోజుల్లో 8 మందికి సర్జరీలు పూర్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మందికి సర్జరీలు పూర్తయ్యాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి డాక్టర్ వెంకట రమణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం, నిమ్స్ వైద్యులు, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్ల పరస్పర సహకారంలో ఈ సర్జరీలు నిర్వహించారు. చిన్నారులకు గుండె సర్జరీలు చేయడం అనేది ఎంతో క్లిష్టమైనది. ఖరీదైనది. ప్రయివేటులో దాదాపు రూ.ఐదు లక్షల వరకయ్యే ఈ చికిత్సను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగా నెల రోజుల వయసున్న శిశువుకు సర్జరీనీ విజయవంతంగా చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన నెల రోజుల వయ సున్న శిశువు (తల్లి ఫాతిమా) ఇటీవల తీవ్ర హృద్రోగ సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే శిశువు బరువు కేవలం 2.5 కిలోలు. ఆర్టీరియల్ అనాటమీ, మల్టిపుల్ వెంట్రి క్యులార్ సెప్టల్ డిఫెక్ట్స్‌తో హాస్పిటల్లో చేరింది. బ్రిటన్ నిపుణులు, నిమ్స్ వైద్యులు, నీలోఫర్ డాక్టర్లు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. గత నెల 28వ తేదీన శిశువుకు ఆర్టీరియల్ స్విచ్ రిపేయిర్, మల్టి పుల్ వీఎస్డీ క్లోజర్ సర్జరీలు విజయవంతంగా నిర్వ హించారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే మొదటిసారి కాగా, శిశువు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నది. క్రమంగా కోలుకుంటున్నది.
మంత్రి హరీశ్ రావు అభినందనలు
అరుదైన సర్జరీ చేసి శిశువు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులను వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి నిమ్స్ లో చిన్నారులకు చేసే సర్జరీల్లో పాల్గొనడం, సహకారం అందించడం గొప్ప విషయం. శిశువు త్వరలోనే పూర్తిగా కోలుకొని తల్లి ఒడికి చేరాలని ఆకాంక్షించారు.