Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-గాంధారి
ప్రభుత్వ అసైన్డ్ భూమిని పేదలకు పంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మతు సంగెం గ్రామంలో భూపోరాటంలో భాగంగా గురువారం ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి.. సీపీఐ(ఎం) జెండా ఎగురవేశారు. అనంతరం నాగలి పట్టి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు వేలాది ఎకరాలప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగిస్తున్నాయని, నిరుపేదలకు ఎకరం భూమి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసుకునే వారికి భూమి లేదని.. కానీ వ్యవసాయం చేయని వారికి వేలాది ఎకరాల భూములు ఉన్నాయని అన్నారు. కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయని, వాటిని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మతుసంగెం గ్రామంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించుకొని బోగస్ పట్టాలు చేసుకున్నారని, ఇలాంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని నిరుపేదలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇలాంటి బోగస్ పట్టాలు రద్దు చేసి దళితులకు, భూమిలేని అన్ని వర్గాల ప్రజలకు భూములు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని లేకుంటే, సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్వీ రమ, జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, నాయకులు మోతీరాం నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కమ్మరి సాయిలు, మధు, భీమ్‌సింగ్, లక్ష్మిబాయి, మల్ల్లేష్, రాంసింగ్, చింటూ, దేవిసింగ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.