Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఎస్ఐ దవాఖానా జాడేదీ..
- 60 వేల మంది కార్మికులు.. 400 పైగా పరిశ్రమలు
- బొల్లారంలో స్థల సేకరణ.. భవన నిర్మాణం పట్ల అశ్రద్ధ
- డిస్పెన్సరీల్లో వైద్య పరీక్షల్లేవ్..మందుగోలి కరువు
- 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని సీఐటీయూ పోరాటాలు
నవతెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ మెడికల్ హబ్‌గా మారుతుంది. అత్యాధునిక ఆస్పత్రులు, వైద్య కళాశాలలు విస్తరిస్తున్నాయి.. అయితే, పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఉచిత వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఇక్కడ వేలాది మంది కార్మికులు, కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. డిస్పెన్సరీల్లో మందుగోలి సైతం దొరకదని ఆవేదన చెందుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలుగా విస్తరించాయి. ఈ ప్రాంతంలో సుమారు 400కి పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్, జార్జండ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వలసొచ్చిన కార్మికులున్నారు. ఈ ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడంతో కార్మికులకు అత్యవసర సమయాల్లో వైద్యం అందడం లేదు. పరిశ్రమల్లో నిత్యం పొల్యూషన్ మధ్య పనిచేయడం, కుటుంబాలు ఆ ప్రాంతంలోనే నివసించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. కెమికల్, ఫార్మా, ఇతర పరిశ్రమల్లో ప్రమాదాలు తరచూ జరగడంతో కార్మికులు గాయాలపాలవుతున్నారు. సరైన సమయానికి వైద్యమందక జనవరి మాసంలో జరిగిన ప్రమాదాల్లోనే ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఇటీవల కాలంలో గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, పటాన్చెరు, ఖాజీపల్లిలో వివిధ పరిశ్రమల్లో 58 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 45 మంది కార్మికులు చనిపోయారు. 161 మంది గాయపడ్డారు. అత్యవసర వైద్యమందకపోవడం వల్ల కొందరు చనిపోయారు. స్థానికంగా ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని కార్మికులు కోరుతున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని సీఐటీయూ అనేక పోరాటాలు చేసింది.
100 పడకల ఆస్పత్రి అవసరం
పారిశ్రామిక వాడలో 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిసి లక్షకు పైగా కార్మిక జనాభా ఉంది. కార్మికుల కోసం బొల్లారంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం చేయాలని స్థలం సేకరించారు. మూడేండ్లు కావస్తున్నా ఆస్పత్రి నిర్మించలేదు.
కనీసం పునాది కూడా తవ్వలేదు. స్థానికంగా మెరుగైన వైద్యం అందించేందుకు బొల్లారంలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సిటీస్కానింగ్, ఎంఆర్ఐ, ఇతర వైద్య పరీక్షలు, ఆపరేషన్లు, అత్యవసర వైద్యం, 24 గంటలు డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్స్, అవసరమైన మందుల సౌకర్యం అందుబాటులో ఉంచి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.
మొక్కుబడి డిస్పెన్సరీలు
కార్మికులకు వైద్యం అందించేందుకు ఈఎస్ఐ డిస్పెన్సరీలు పెట్టారు. బొంతపల్లిలో శిథిలావస్థలో ఉన్న అద్దె ఇంట్లో డిస్పెన్సరీ నడుస్తోంది. ఎప్పుడు కూలుద్దో అన్న టెన్షన్లో వైద్య సిబ్బంది ఉంటున్నారు. మరో డిస్పెన్షరీ రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో ఉంది. అక్కడికి సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, ఇతర కార్మికులు వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. బాచుపల్లిలో ఉన్న డిస్పెన్సరీని బొల్లారానికి మార్చాలని కార్మికులు, సీఐటీయూ ఎప్పటి నుంచో పోరాడుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో సనత్‌నగర్‌లో ఉన్న ఆస్పత్రికి వెళ్లితే ఇన్‌పేషెంట్లకు మాత్రమే వైద్యం అందుతోంది.
వంద పడకల ఆస్పత్రి నిర్మించాలి
పారిశ్రామిక వాడల్లో ఉన్న కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం బొల్లారంలో అత్యాధునిక సదుపాయాలతో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి. ఆస్పత్రి కోసం గతంలోనే స్థలం సేకరించారు. నిర్మాణం గురించి పట్టించుకోవడంలేదు. ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావుకు అనేకసార్లు లేఖలు రాశాం. విన్నతిపత్రాలిచ్చాం. పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల అత్యవసర వైద్యం కోసం దూరం వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు కల్గుతున్నాయి.
- కె.రాజయ్య- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
ఈఎస్ఐ ఆస్పత్రి లేక అవస్థలు
ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అనారోగ్యం పాలైతే డిస్సెన్సరీకి వెళ్తే గోలీలిచ్చి పంపుతున్నారు. బాచుపల్లికి వెళ్లి రావాలంటే ఇబ్బందిగా ఉంది. బొల్లారంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించి వైద్యం అందుబాటులోకి తేవాలి.
- కార్మికుడు ఉమేష్- బొల్లారం