Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయ పరిరక్షణే లక్ష్యం పోరాడుదాం
- దేశాన్ని కాపాడుదాం
- ప్రజాస్వామ్య పరిరక్షణే యాత్ర ధ్యేయం
- మతోన్మాద విధానాలు దేశానికి ప్రమాదకరం
- దళితులు,మైనార్టీలు, మహిళలపై దాడులను ప్రతిఘటిద్దాం
- పౌరస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న సంఫ్‌ు పరివార్
- 29న హైదరాబాద్‌లో ముగింపుసభకు ప్రకాశ్కరత్ హాజరు
- ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజంపై కేంద్రం దాడి
- బీజేపీ అప్రజాస్వామిక విధానాలు, మతోన్మాదం దేశానికి విఘాతం
- రాజ్యాంగస్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తాం : రాఘవులు
రాష్ట్రంలో ఈనెల 17 నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'జనచైతన్య యాత్ర'కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలు తిరిగేలా బస్సుయాత్ర ప్రణాళికను రూపొందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిని ఎండగట్టడమే ఈ యాత్ర లక్ష్యం. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థపై కేంద్రం దాడికి నిరసనగా ఈ యాత్రను చేపడుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. మొదటి యాత్ర ఈనెల 17న వరంగల్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు. ఈనెల 23న ఆదిలాబాద్‌లో రెండో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రారంభం చేస్తారు. ఈనెల 24న నిజామాబాద్‌లో మూడో యాత్రను ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ ఎ విజయరాఘవన్ ప్రారంభిస్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య,పొతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. దాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని అన్నారు. అప్పుడే దేశ సమైక్యతను కాపాడుకోగలమన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలు కాకుండా ఆటంకాలు కల్పిస్తున్నదని చెప్పారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. తెలంగాణలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి అదే విధంగా ఉందన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ బిల్లులను తిరస్కరించడం, సవరించాలని చెప్పడం, ఆమోదించడం ఏదీ చేయకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది ఫెడరల్ వ్యవస్థ మీద దాడి తప్ప మరొకటి కాదన్నారు. గవర్నర్ వైఖరి రాజ్యాంగవిరుద్ధమని విమర్శించారు. గవర్నర్ అనాలోచిత వైఖరిని విడనాడి ఆ బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని చెప్పారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీం కోర్టుపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. వారికి నచ్చిన వారిని న్యాయమూర్తులుగా నియమించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం తొక్కిపెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి ప్రజాస్వామ్యానికి అవసరమనీ, దాన్ని ప్రజలంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ మతోన్మాద వైషమ్యాలను పెంచిపోషిస్తున్నదని చెప్పారు. హర్యానాలో ఇద్దరు మైనార్టీలను గోరక్షక దళాలు హతమార్చాయని అన్నారు. పెండ్లి, మతం వ్యక్తిగతమంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం సంతోషకరమ న్నారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా బీజేపీ, సంఫ్‌ుపరివార్ శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శిం చారు. సామాజిక న్యాయంపై దాడి చేస్తున్నాయని చెప్పారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉంటూనే ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సామాజికన్యాయం, ఫెడరలిజంపై దాడి చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమించడంలో ముందున్నారని చెప్పారు. ఆ స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగించి సీపీఐ(ఎం)కు ప్రజలంతా సహకరించాలని కోరారు.
దేశాన్ని కాపాడుకోవడం కోసమే ఈ యాత్ర : తమ్మినేని
తెలంగాణపై బీజేపీ గురిపెట్టిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు, ప్రధాని ఇక్కడికి వస్తున్నారని అన్నారు. ప్రజాసమస్యల కంటే మతచిచ్చు రేపడమే వారి లక్ష్యమని విమర్శించారు. 'భాగ్యలక్ష్మి దేవాలయం పేరుతో విద్వేషాలు పెంచడం, సచివాలయం గుమ్మటాలు నిజాంకాలం నాటి కట్టడాలుగా ఉన్నాయనీ, మసీదులు తవ్వితే శవాలు వస్తే వారికి, శివలింగాలు వస్తే మాకు'అంటూ బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని అన్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ, మరోవైపు లౌకికత్వం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై కేంద్రం దాడి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ మూలసిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అది తెలుసుకుంటే ఎస్సీ,ఎస్టీ,బీసీలు బీజేపీ దరికి చేరబోరని అన్నారు. హిందూత్వ రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమనీ, చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. సమసమాజం రావాలనీ, దోపిడీ పోవాలనీ, కులరహిత సమాజం ఉండాలనీ కమ్యూనిస్టులు కోరుకుంటారని చెప్పారు. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలనీ, మనుస్మృతి ప్రకారం కుల ధర్మాలు పాటించాలనీ, కులవృత్తులుండాలనీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటాయని వివరించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదంటూ, మనుధర్మం అమలు చేయాలని భావిస్తున్నదని అన్నారు. ఎన్నికల సభల్లో వాటిని వివరించరు, కానీ, అంతర్గత సమావేశాల్లో కార్యకర్తలకు అదే చెప్తారని చెప్పారు. ఈ వాస్తవాలు తెలిస్తే ప్రజలు వారి వెనుక ఉండబోరని వివరించారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 17 నుంచి చేపట్టే జనచైతన్య యాత్రలో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. పది లక్షల కరపత్రాలు పంచుతామనీ, రెండు లక్షల పోస్టర్లు, బీజేపీ ప్రమాదంపై బుక్లెట్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా మోటార్ సైకిళ్లుంటాయని వివరించారు. నాయకుల బృందం బస్సులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభంజనంలా ఈ యాత్రను చేపడతామని అన్నారు. ఇది సీపీఐ(ఎం) కోసమో, బీజేపీని విమర్శించడం కోసమో కాదనీ చెప్పారు. దేశాన్ని కాపాడుకోవడం కోసమని వివరించారు. వామపక్షాలు, ఇతర లౌకికశక్తులు, సామాజిక సంఘాలు, మేధావులు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.
మూడు ప్రాంతాల నుంచి యాత్రలు
మొదటి యాత్ర
ప్రారంభం
2023 మార్చి 17 వరంగల్‌లో
ప్రారంభకులు
సీతారాం ఏచూరి
(సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి)
బృంద నాయకుడు
పోతినేని సుదర్శన్
(సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
పర్యటించే జిల్లాలు
హన్మకొండ, వరంగల్, మహబూబాబాదు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి
2వ యాత్ర
ప్రారంభం
2023 మార్చి 23 ఆదిలాబాదులో
ప్రారంభకులు
బివి రాఘవులు
(సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు)
బృంద నాయకుడు
ఎస్ వీరయ్య
(సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
పర్యటించే జిల్లాలు
ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి,
మేడ్చల్ మల్కాజిగిరి
3వ యాత్ర
ప్రారంభం
2023 మార్చి 24 నిజామాబాదులో
ప్రారంభకులు
ఎ విజయరాఘవన్
(సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ)
బృంద నాయకుడు
జాన్‌వెస్లీ
(సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
పర్యటించే జిల్లాలు
నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్
ముగింపు : 2023 మార్చి 29 హైదరాబాదు (ఇందిరాపార్కు)