Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- మొదటి ప్రాధాన్యతా ఓటుపైనే దృష్టి
- అభ్యర్థులందరిలోనూ గెలుపు పట్ల ధీమా
- ప్రచారంలో అందరూ బిజీబిజీ
- ఉపాధ్యాయులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు, బలపరుస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అభ్యర్థులతోపాటు ఆయా సంఘాల నాయకులు కూడా ప్రచారంలో నిమగమయ్యారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రచారంలోనే తీరికలేకుండా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లతోపాటు నివాస ప్రాంతాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి సీరియల్ నెంబర్లను ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీంతో అభ్యర్థులకు కేటాయించిన సీరియల్ నెంబర్‌కు ఎదురుగా మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులను అభ్యర్థిస్తున్నారు. అయితే నామినేషన్ వేసిన వారిలో ఒక్కరు కూడా ఉపసంహరించుకోకపోవడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. అయితే ఏ అభ్యర్థికి ఇది లాభం చేకూరుస్తుందన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో ఇదే చర్చ విస్తృతంగా సాగుతున్నది. ఈ నియోజకవర్గంలో 29,749 మంది ఓటర్లున్నారు. 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 13న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈనెల 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. బ్యాలెట్ పత్రాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాలకు పంపించడం, ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులు, సహాయకులను సిద్ధం చేయడం వంటి పనుల్లో నిమగమైంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి పదవీకాలం ఈనెల 29వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.
మాణిక్రెడ్డివైపు ఉపాధ్యాయుల మొగ్గు
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 21 మంది అభ్యర్థులున్నారు. టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థిగా పాపన్నగారి మాణిక్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి బి భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, బీసీటీఏ నుంచి ఎస్ విజయకుమార్, టీపీటీఎఫ్ నుంచి వినరుబాబు, బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, టీఎస్టీసీఈఏ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అయినేని సంతోష్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎవరికీ మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. టీఎస్‌యూటీఎఫ్ బలపరిచిన పాపన్నగారి మాణిక్రెడ్డివైపు ఎక్కువ మంది ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. 2017 ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఉపాధ్యాయుల్లో కొంత సానుభూతి ఉన్నది. ఇంకోవైపు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. అనేక పోరాటాల్లో భాగస్వాములయ్యారు. కాంట్రాక్టు అధ్యాపకులు, గురుకుల ఉపాధ్యాయులు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు కూడా ఆయనకు మద్దతును ప్రకటించారు. ప్రచారంలోనూ విశేష స్పందన వస్తున్నది. ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు. అందుకే మాణిక్‌రెడ్డిని గెలిపించాలని ఉపాధ్యాయులు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇతర అభ్యర్థులకు ప్రతికూల పవనాలు
టీఎస్‌యూటీఎఫ్ బలపరిచిన మాణిక్‌రెడ్డి కాకుండా బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఎన్నో ఏండ్ల తర్వాత చేపట్టిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు రాకపోవడం, డీఏలు పెండింగ్‌లో ఉండడం ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణంగా ఉన్నది. చివరికి జీపీఎఫ్ రుణాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోవడానికి నెలలపాటు ఆగాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. ఇంకోవైపు 317 జీవో బాధితులు, స్పౌజ్ టీచర్లు, భాషా పండితులు, పీఈటీలు కూడా గుర్రుగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి రెండుసార్లు గెలిచినా ఉపాధ్యాయుల సమస్యల పట్ల శాసనమండలిలో గొంతు వినిపించలేదన్న విమర్శ ఉన్నది. పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆయన పట్ల వ్యతిరేకత వస్తున్నది. దీంతో చెన్నకేశవరెడ్డికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బీజేపీ నుంచి ఓ కార్పొరేట్ పాఠశాల యజమాని ఏవీఎన్ రెడ్డి బరిలో ఉండగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘమైన తపస్ ఆయన్ను బలపరుస్తున్నా ప్రచారం నామమాత్రంగానే చేస్తున్నట్టు తెలుస్తున్నది. కార్పొరేట్ యాజమాని కావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయన్ను మండలిలో తమ గొంతు వినిపించే అభ్యర్థి అని భావించడం లేదు. 29,749 ఓట్లలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులే 16,890 ఉన్నారు. సీపీఎస్ రద్దు, నూతన విద్యావిధానం గురించి ఆయన ప్రస్తావించడం లేదు. దీంతో మెజార్టీ ఓటర్లు ఏవీఎన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఇంకోవైపు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేసే అధ్యాపకులు 4,587 మంది ఓటర్లుగా ఉన్నారు. కార్పొరేట్ యజమాని కావడంతో డబ్బులు పంచి, ప్రలోభాలకు గురిచేసి గెలవాలని ఆయన భావిస్తున్నారు. ఇది ఉపాధ్యాయుల గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది కాబట్టి దాన్ని సహించడం లేదు. ఈ పరిస్థితుల్లో సహజంగా నిత్య ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమించే టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డికే ఉపాధ్యాయుల నుంచి సానుకూలత కనిపిస్తున్నది. పోలింగ్ నాటికి ఉపాధ్యాయులపై ఏ ప్రభావాలు ఏ పరిస్థితికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే.