Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రిని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్జీసీసీఎల్ఏ- 475) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ కలిశారు. గతనెలలో ప్రారంభమై ఈనెల రెండో తేదీ వరకు ఇంటర్ బోర్డు నిర్వహించిన జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సంఘం నుంచి మంత్రిని కలిసి ధన్యవాదాలు ప్రకటించారు. ఈనెల 15 నుంచి జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తరఫున అధ్యాపకు లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.