Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య కండ్ల ముందే భర్తను కత్తులతో పొడిచి హత్య
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం యువతిని వారి వెంట తీసుకెళ్లారు. రెండ్రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
దూలపల్లిలోనే సూరారం కాలనీలో హరీష్(28) కుటుంబం 6 నెలలుగా నివాసం ఉంటోంది. గతంలో ఎర్రగడ్డలో అతను నివాసం ఉన్న సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు హరీష్‌ను హెచ్చరించారు. దాంతో అతడు దూలపల్లికి మకాం మార్చాడు. అక్కడ ఓ ఇంటిని నిర్మించుకొని తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే, గతంలో ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. దాంతో హరీష్‌పై పగ పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిని ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశారు. ఇందుకోసం వారి కదిలికలపై నిఘా పెట్టారు. రెండ్రోజుల కిందట దూలపల్లి వద్ద దంపతులను గమనించి హరీష్‌ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం అమ్మాయిని తమతోపాటు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వివాహమే హరీష్ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్త చేపట్టారు.
హరీష్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. తన చెల్లి వెంట పడొద్దని హరీష్‌ను యువతి సోదరుడు ఇదివరకే హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. ప్రేమ, పెండ్లి విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. అయినా హరీష్ అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అతడిపై యువతి సోదరుడు పగ పెంచుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి వచ్చి హరీష్‌ను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.