Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రచయిత, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
నవతెలంగాణ-కాప్రా
నిజమైన భారతీయతను ప్రజలలోకి తీసుకెళ్లడం ఈ కాలంలో అత్యవసరం అని రచయిత, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గొడుగు యాదగిరిరావు రచించిన ''భారతీయత అజేయం'' కవితా సంకలనాన్ని హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని కమలానగర్ సీఐటీయూ హాలులో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. సభకు ప్రముఖ రచయిత పిబి.చారి అధ్యక్షత వహించారు. తెలకపల్లి రవి మాట్లాడుతూ.. యాదగిరిరావు ఎప్పుడూ ఒంటరిగా ఉండరని.. ఈసీఐఎల్‌లో కవులను పోగుచేసి పద్మభూషణ్ డాక్టర్ ఏఎస్ రావు జన్మదినం సందర్భంగా కవితా సంకలనాలు తీసుకొచ్చి ఆవిష్కరణలు జరిపేవారని తెలిపారు. పుస్తకాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసేవారని గుర్తు చేశారు. వాటిలో తాను చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యానన్నారు. భారతీయత అంటే ఆర్ఎస్ఎస్, మనువాదులు చెప్పే రీతిగా నిచ్చెన మెట్ల సంస్కృతి కాదన్నారు. భారతీయత అంటే అందరూ సమానంగా జీవించే ప్రక్రియ అన్నారు.
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి వికాసంలో మాయని మచ్చ మనువాదం అని.. దాని దుర్మార్గపు పోకడలను తూర్పార పట్టిన కవితా సంకలనం యాదగిరిరావు రాసిన 'భారతీయత అజేయం' అద్భుతంగా చూపించిందన్నారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తాను ఈ పుస్తకంలో ముందుమాట రాశానని చెప్పారు. ప్రధాన వక్త పీఏ దేవి మాట్లాడుతూ.. భారతీయతను మనువాదులు వక్రీకరించారని, దానినే నిజమని రుజువు చేయటానికి అనేక తప్పుడు పద్ధతులు పాలకులు అనుసరిస్తున్నారని చెప్పారు. రచయిత గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ.. తాను రాసిన కవితలను, వ్యాసాలను చదివి తనను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అనంతరం ఆహ్వానితులకు చేనేత వస్త్రాలతో ఆత్మీయ సత్కారం చేశారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు శ్రీమన్నారాయణ వందన సమర్పణ చేశారు.
స్ఫూర్తి గ్రూప్ నాయకులు జి.శివరామకృష్ణ ఆహ్వానితులను వేదిక మీదికి ఆహ్వానించారు. గురజాడ అప్పారావు రాసిన దేశభక్తి గీతాన్ని రుక్కయ్య పాడారు. అధ్యక్షులు పి.బి చారి ఆవిష్కరణలో భాగస్వామయ్యారు. ప్రజాసంఘాల బాధ్యులు నరసింహారావు, సత్యం, రాజన్న, రచయిత జ్యోతి, శ్రీనివాసరావు, విద్యార్థి నాయకులు సంతోష్, మాజీ కౌన్సిలర్ చల్లా లీలావతి, ప్రముఖ రచయిత జయప్రకాష్, భాస్కర్‌రావు, కోమటి రవి, వెంకట్ ప్రసాద్ బాబు, బసవ పున్నయ్య, వెంకటేశ్వరరావు, మల్లేష్, శరత్ సుదర్శీ, వినోద గారు శారద, జ్యోతి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.