Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలోని అగ్రి గోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు పంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని చేయకుంటే తామే ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంచుతామని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ బాలమల్లేష్ అధ్యక్షతన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది డిపాజిట్ దారులు అగ్రిగోల్డ్ సంస్థకు రూ.500 కోట్లు డిపాజిట్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ సంస్థకు రూ. వెయ్యికోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయనీ, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు, ప్లాట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు 32 లక్షల మంది ఉన్నారన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం రూ.20వేలు లోపు ఉన్న డిపాజిట్ దారులకు తిరిగి డబ్బు చెల్లించారనీ, తెలంగాణలో కూడా కొంత మేరకైనా బాధితులకు డబ్బులు చెల్లించి ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. బాలమల్లేష్ మాట్లాడుతూ శనివారం హిమాయత్‌నగర్‌లో భిక్షాటన చేస్తూ, నిరసన తెలుపుతామని చెప్పారు.
ఈనెల 14, 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రజిత, రాష్ట్ర కోశాధికారి రామారావు, రాష్ట్ర నాయకురాలు ఎన్. సునీత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు ఎల్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.