Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఆర్సీకి ఎస్ఎఫ్ఐ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు నేతృత్వంలో ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ శ్రీచైతన్య కళాశాలలో మార్కులు, ర్యాంకుల దాహం కోసం విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నదని తెలిపారు. కృష్ణారెడ్డి, ఆచార్య, జగన్, నరేష్లపై ఐపీసీ 305, 302 సెక్షన్లు నమోదు చేసినా పోలీసులు ఇంత వరకు వారిని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.
యాజమాన్యంతో సెటిల్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. శ్రీచైతన్య యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొక విద్యార్థి నష్టపోకుండా కమిషన్ స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.