Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకంటే రాజ్‌భవనే దగ్గర
- సుప్రీంలో పెండింగ్ బిల్లుల కేసుపై గవర్నర్ ట్వీట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికీ గవర్నర్‌ను కలిసేందుకు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టైం దొరకలేదు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర్లోనే ఉంది' అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ బిల్లుల్ని గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో గురువారం రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటికి తక్షణమే ఆమోద ముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై స్పందిం చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై విధంగా ట్వీట్ చేశారు. ''రాజ్ భవన్ ఢిల్లీ కంటే దగ్గరగా ఉంటుంది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి శాంతికుమారికి సమయం లేదా? అధికారికంగా రాలేదు. ప్రొటోకాల్ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ నన్ను కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి'' అని గవర్నర్ ట్వీట్ చేయడం గమనార్హం.