Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం ప్రతినీటి బొట్టులో సీఎం కేసీఆర్ ప్రతిబింబం
- పది రోజుల్లో దాచారం భూ సమస్య పరిష్కారం
- 119 మంది రైతులకు పట్టా ప్రొసీడింగ్ కాపీల అందజేత : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-సిద్దిపేట
'సద్దితిన్న రేవు తలవాలి. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలి. కాళేశ్వరం ప్రతినీటి బొట్టులో సీఎం కేసీఆర్ కనపడుతున్నారు. వారం పది రోజుల్లో దాచారం భూ సమస్యను పరిష్కరిస్తాం' అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండలం విఠలాపూర్‌లోని 105 మంది, గంగాపూర్‌లోని 10 మంది, మాచాపూర్లోని నలుగురు రైతులకు, అర్హులైన లబ్దిదారులకు పట్టా ప్రొసీడింగ్ కాపీలు జెడ్పీ చైర్మెన్ రోజాశర్మతో కలిసి మంత్రి అందజేశారు. ఏండ్ల తరబడి నెలకొన్న భూ సమస్యకు మంత్రి హరీశ్‌రావు చొరవతో పరిష్కారం లభించింది. 119 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్య సాకారం కావడంతో లబ్దిదారులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారం పది రోజుల్లో దాచారం భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలిసీతెలియక అసైన్డ్ భూమి కొన్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు ఎదురవ్వడం, పలువురి భూమి కాస్తులో ఉన్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. రోజులతరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పనిని మీ గ్రామానికే అధికారులు, ప్రజాప్రతినిధులను పంపించి భూ సమస్యలు పరిష్కారం చేయించినట్టు తెలిపారు. ఇవాల్టి నుంచి మీ భూమికి సర్వ హక్కులు చేకూరాయన్నారు. మీరు హక్కుదారులుగా మారారని, దాదాపు 109 ఎకరాల మేర భూమి మీ పేరిట పట్టా చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నట్టు వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మండుటెండలలో విఠలాపూర్ చెరువు మత్తడి దూకూతున్నదన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషితో సాధ్యమైందన్నారు. త్వరలోనే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో భూ రెవెన్యూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏంపీపీ మాణిక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవీన్, చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.