Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం అమ్ముకున్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు : పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైస్ మిల్లర్ల నుంచి (కస్టమ్ మిల్లింగ్ రైస్) సేకరణ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌లో జరుగుతున్న జాప్యంపై శుక్రవారం పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌తో కలిసి రవీందర్‌సింగ్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎంఆర్ సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి యుద్దప్రాతిపదికన భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) బియ్యాన్ని అప్పగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా 25 మంది పౌరసరఫరాల సంస్థ విజిలెన్ ఆండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల సంస్థ ఉన్నత అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ బృందాలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైసు మిల్లుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాయనీ, ముందుగా సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న జిల్లాల నుంచి తనిఖీలు ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని వారికి సూచించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం రైసు మిల్లుల్లో ఉందా? లేదా? గడువు ప్రకారం సీఎంఆర్ అప్పగించారా? పెండింగ్ ఉన్న సీఎంఆర్ ఎంత? వంటి అంశాలతో పాటు, కరెంట్ బిల్లులు, ఎ,బి రిజిస్టర్లను తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని అమ్ముకున్న రైసు మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌లో జాప్యం చేస్తున్న మిల్లుల నుంచి ధాన్యాన్ని ఇతర మిల్లులకు షిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ కోసం అవసరమైన బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించామనీ, ఇక నుంచి ప్రతి బియ్యం గింజను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కి అప్పగించవలసిందేననీ, ఎట్టి పరిస్థితిలోనూ పౌరసరఫరాల సంస్థ తీసుకోబోదని స్పష్టం చేశారు. సీఎంఆర్ అప్పగింతలో ఎంత జాప్యం జరిగితే కార్పోరేషన్‌పై అంత ఆర్థికభారం పడుతుందని ఈ విషయాన్ని గుర్తించి అధికారులు మరింత క్రియాశీలకంగా పనిచేయాలన్నారు.
2021-22లో రెండు సీజన్లలో గడువులోగా రైస్ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోకపోవడంలో కొంతవరకు ఎఫ్‌సీఐ కారణం అయితే కొంతభాగం పౌరసరఫరాల అధికారుల అలసత్వం కూడా ఉందని తెలిపారు. ప్రత్యేక బందాలకు ఆయా జిల్లాల అధికారులు సహకరించాలని ఏ మాత్రం సహాయనిరాకరణ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోగా ఎఫ్‌సిఐకి సీఎంఆర్ ఇవ్వకపోతే ఆ బియ్యానికి బదులుగా 25 శాతం జరిమానాతో నగదు రూపంలో వసూలు చేస్తామే తప్ప బియ్యాన్ని మాత్రం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మిల్లర్లకు కూడా తెలియజేయాలని ఆదేశించారు. 2019-20కి సంబంధించిన 118 మంది మిల్లర్లపై విధించిన 25 శాతం జరిమానాను కూడా వసూలు చేయాలనీ, అలాగే మార్చి 25వ తేదీలోగా ఆయా జిల్లా అధికారులు ఎఫ్‌సిఐకి బిల్లులు సమర్పించాలని ఆదేశించారు.