Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
- కలెక్టరేట్లు ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట వంటావార్పు, ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థకు నిర్వీర్యం చేసి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి ప్రయి వేటీకరించేందుకు చేస్తున్న కుట్రను నిరసిస్తూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) మూడ్రోజులపాటు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భారీ ర్యాలీగా పట్టణ పుర వీధుల గుండా వన్ టౌన్ క్రిస్టియన్ పల్లి పాలకొండ కలెక్టరేట్ చేరుకొని రెండు గంటలపాటు బైటాయించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ధర్నా లో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు 50 శాతం బడ్జెట్ తగ్గించి క్రమంగా ప్రయివేటీక రించడానికి కుట్ర చేస్తోందన్నారు. జీవో నెంబర్ 8, 19 సవరించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, సీని యార్టీ ప్రకారం క్వాలిఫికేషన్ ఆధారం గా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కింది స్థాయిలో ఉన్న వేధింపులు, పని ఒత్తిడి ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపో తే ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చ రించారు. ధర్నా అనంతరం అంగన్వా డీ పీడీ జరినాబేగంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట వంటావార్పు, భోజన కార్యక్ర మాలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి జిల్లా కోశాధికారి చంద్రకాంత్, జిల్లా సహాయ కార్యదర్శి టి సత్తయ్య, రాజ్‌కూమార్, యూని యన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుష్పలత ప్రభావతి గౌస్య బేగం తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఈవోకి వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి అనం తరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం జాయింట్ కలెక్టర్ మోతిలాల్కి వినతిపత్రం అందజేశారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ఎదుట అంగన్వాడీలు సమ్మె నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం కార్యదర్శి నరసింహా రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఐసీడీఎస్‌ను పరిరక్షిం చాలి, ఐసీడీఎస్‌కు బడ్జెట్ పెంచి అంగన్వాడీలను అదుకోవాలి, నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పాల్గొని మాట్లాడారు. ఐసీడీఎస్ వ్యవస్థను కనుమరుగు చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. స్త్రీ, శిశుసంరక్షణ కోసం పని చేస్తున్న ఐసీడీఎస్‌కు నిధులు కుదించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. అనంతరం స్త్రీ- శిశు సంక్షేమ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. చేవెళ్లలో అంగన్వాడీలు నిరసన తెలి పి, కలెక్టరేట్‌కు వెళ్లారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యం లో అంగన్వాడీలు నిరసన తెలిపారు.
యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరే ట్ ఎదుట అంగన్వాడీలు వంటా వార్పు చేసి నిరసన తెలిపారు. సూర్యా పేట జిల్లా పెన్‌పహాడ్‌లో నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్‌లో వందలాది మంది అంగన్వాడీ టీచర్లు బైటాయించి ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా ధర్నా వద్దకు జిల్లా జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి లెనినాకు వినతి పత్రం అందజేశారు. ఆమె సానుకూలంగా స్పందించారు. అంతకుముందు దీక్షా శిబిరాన్ని సీపీఐ (ఎం) మాజీ ఎంపీ మిడియం బాబు రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బహ్మచారి, ఏజే.రమేష్ సందర్శించి మద్దతు తెలిపి, మాట్లాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో భారీ మానవహారం కార్య క్రమం నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కి మెమొరాండం అందజేశారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ఆధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అంగన్ వాడీలు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ హేమంత్‌కు వినతిపత్రం అందజేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద మూడవ రోజు శుక్రవారం అంగన్వాడీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. నిరసన చేపట్టి నినాదా లతో హోరెత్తించారు. తమ 20 డిమా ండ్లు పరిష్కరించాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ బైటాయించారు. అనంత రం అంగన్వాడీ కార్యకర్తలు పాద యాత్రగా ధర్నా చౌక్, సీపీ, రైల్వే కమాన్, జెడ్పి ఆఫీస్, సుభాష్ నగర్, సంజీవయ్య కాలనీ, దుబ్బ మీదుగా కొత్త కలెక్టరేట్‌కు చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ ఏవోకు, ఐసిడిఎస్ పీడీకి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో అంగన్వాడీలు, నాయకులు ర్యాలీ గా కలెక్టరేట్‌కు పెద్దఎత్తున తరలి వెళ్లారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కలెక్టరేట్ వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తా మని వెల్లడించారు.
- అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి రంగారెడ్డి లేఖ
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులున్నారనీ, 40 ఏండ్లకు పైగా వీరు సేవలందిస్తున్నా కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవి లేవని తెలిపారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాయనీ, తమిళనాడు, కర్ణాటకలో హెల్త్ కార్డులిచ్చారనీ, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పండుగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్‌గా మార్చారనీ, టీచర్లతో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదని గుర్తుచేశారు. ''కేంద్రం అమలు చేస్తున్న పోషన్ ట్రాకర్ యాప్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌ను తేవడం ద్వారా అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లకు రూ.3 లక్షలు ఇవ్వాలి. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని వారు చాలాకాలంగా కోరుకుంటున్నారు. 2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగులకు 1972 గ్రాట్యుటీ చట్టం వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీంతో వయస్సు పైబడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుంచి టీఏ, డీఏ, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్సులు, 2018 లో అంగన్వాడీ టీచర్లకు రూ.1,500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1,250 పెంచిన వేతనాన్ని ఇవ్వడం లేదు.....'' అని ఆయన తెలిపారు.''నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఐసీడీఎస్ బడ్జెట్ ను పెంచాలి. జాతీయ విద్యా విధాన చట్టాన్ని రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించడంతో పాటు వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించి అమలు చేయాలి. టీచర్లతో సమానంగా వేతనం, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలి. 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన వేతనాన్ని అమలు చేసి, 2017 నుంచి టీఏ, డీఏ బకాయిలు చెల్లించాలి. 2021 జూలై, అక్టోబర్, నవంబర్ నెలల పీఆర్సీ ఎరియర్స్‌ను చెల్లించాలి. గ్రామ సర్పంచులను చైర్మెన్‌గా నియమించే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలి. మదర్స్ కమిటీలకు చైర్మెన్ తల్లులను మాత్రమే నియమించాలి. ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పైసల నుంచి రూ.5కు, గర్భిణీ, బాలింతలకు రూ.2.40 పైసల నుంచి రూ.10కు పెంచాలి. డబుల్ సిలిండర్లు అన్ని కేంద్రాలకివ్వాలి. ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తిం చాలి. హెల్త్ కార్డులివ్వడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి. 2017 నుంచి ఇంక్రిమెంట్, ఇన్ ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి. ఎన్టీహెచ్ఎస్ యాప్‌ను రద్దు చేసి, పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలి. ఆన్ లైన్ చేయడానికి వీలుగా ఐప్యాడ్ లను ఇవ్వాలి. మట్టి ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిచే కార్యక్రమాలకు ఇచ్చే డబ్బులు రూ.250 నుంచి రూ.2 వేలకు పెంచాలి. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్ వాడీ కేంద్రాలకు వేసవి సెలవు లివ్వాలి. జీవో నెంబర్ 14, 19, 8 లను వెంటనే సవరించాలి... '' అని జూలకంటి ఆ లేఖలో డిమాండ్ చేశారు.