Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగులు పేరుతో ఆర్టీసీ కార్మికుల బదిలీలు
- గతంలో 64 మంది.. ఇప్పుడు 80 మందికి స్థానచలనం
- డబుల్ డ్యూటీలతో పెరిగిన పనిభారం
- అద్దె బస్సులకు ప్రాధాన్యత
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఎస్ ఆర్టీసీ నష్టాల పేరుతో సర్వీసులను కుదిస్తున్నది. పల్లెవెలుగు బస్సులు తగ్గిస్తున్నది. మిగులు సిబ్బంది ఉన్నారంటూ కార్మికులను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నది. అదనపు డ్యూటీలు వేస్తూ రోజువారీ డ్యూటీ షెడ్యూల్స్ మరింత కఠినతరం చేస్తోంది. పని ఒత్తిడితో కార్మికులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటీవల ఖమ్మంకు చెందిన ఓ కార్మికుడు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. మరో కార్మికుడు గుండెపోటుతో మృతిచెందారు.
పని ఒత్తిడి..
ఖమ్మం రీజియన్ పరిధిలో 2600 మంది కార్మికులు ఉన్నాయి. గతంలో 600 వరకు ఉన్న షెడ్యూల్స్(ఒక కండక్టర్, ఒక డ్రైవర్ డ్యూటీ)ను 513కు కుదించడంతో కార్మికులు ఒత్తిడికి లోనవుతున్నారు. కొద్దిరోజుల కిందట 15 ఏండ్లుగా రీజియన్‌లో పనిచేస్తున్న కార్మికులను మిగులు సిబ్బంది పేరుతో 64 మందిని నిజామాబాద్, ఆదిలాబాద్ డిపోలకు బదిలీ చేశారు. తాజాగా 40 మంది డ్రైవర్లు, 40 మంది కండక్టర్లను హైదరాబాద్ రీజియన్‌కు పంపించారు. ఇంకా మిగులు సిబ్బంది ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సిబ్బందిని కుదించి ఉన్నవాళ్లతో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా ఇటీవల సీఐటీయూ, ఏఐటీయూసీ ఖమ్మం ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద నిరసన తెలిపాయి. ట్రాన్స్ఫర్స్ నిలిపివేయాలని కోరుతూ ఆర్ఎంకు వినతిపత్రం ఇచ్చారు.
టైట్ 'షెడ్యూల్'
గతంలో 600కు పైగా ఉన్న షెడ్యూల్స్‌ను ఇప్పుడు 513కు కుదించారు. ఈ షెడ్యూల్స్‌లో ఖమ్మం, రీజియన్ డిపోల మధ్య వ్యత్యాసం ఉంది. డ్రైవర్, కండక్టర్‌ను కలిపి 2.5 చొప్పున షెడ్యూల్స్ లెక్కిస్తున్నారు. ఖమ్మం రీజియన్ 138 షెడ్యూల్స్ చూపిస్తుండగా.. డిపోలో మాత్రం 143గా పేర్కొంది. మధిరలో 62, సత్తుపల్లి 94, భద్రాచలం 87, కొత్తగూడెం 69, మణుగూరు 63, మొత్తంగా 513 షెడ్యూల్స్‌ను నడుపుతున్నారు. దీనిలోనూ ప్రయివేటుకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలున్నాయి.. 266 హైర్ షెడ్యూల్స్ ఉండటం గమనార్హం. దీనికి బస్సుల కండీషన్, కేంద్రం తెచ్చిన 15 ఏండ్లు నిండిన వాహనాల రిజిస్ట్రేషన్ రద్దును సాకుగా చూపుతూ హైర్ బస్సులకు అధిక షెడ్యూల్స్ ఇస్తున్నారని కార్మికులు తెలిపారు. ఇలా ఆర్టీసీ ఎక్కడికక్కడ కార్మికుల విధులను టైట్ చేస్తుండటం, ప్రయివేటీకరణకు పెద్దపీట వేస్తుండటంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
కార్మికుల బదిలీలను నిలిపివేయాలి
కళ్యాణం వెంకటేశ్వరరావు- సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఖమ్మం రీజియన్‌లో మిగులు సిబ్బంది పేరుతో డ్రైవర్, కండక్టర్లను హైదరాబాద్ జోన్‌కు బదిలీ చేయడాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికుల కుటుంబాల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు పంపిన డ్రైవర్లను తిరిగి ఖమ్మం రీజియన్‌కు తీసుకురావాలి. రద్దు చేసిన పల్లెవెలుగు సర్వీసులను పునరుద్ధరించాలి. గతంలో మాదిరిగా షెడ్యూల్స్ నిర్వహించాలి.
బదిలీలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి
ప్రభులత- రీజినల్ మేనేజర్- ఆర్టీసీ- ఖమ్మం
టీఎస్ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో ఎండీ ఆదేశాల మేరకు కార్మికులను బదిలీ చేశాం. ఇప్పటికే వంద మందికి పైగా కార్మికులు అదనంగా ఉన్నారు. వాస్తవానికి 73+ 73 చొప్పున బదిలీ చేయాల్సిన కార్మికులను 40+40 చొప్పున చేశాం. ఈ బదిలీ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఇక్కడి నుంచి వారిని రిలీ వ్ చేశాం. అక్కడ జాయిన్ అయ్యారో లేదో నాకు తెలియదు.
ఎక్కడికక్కడ కోత
రీజియన్‌లో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్త గూడెం, భద్రాచలం, మణు గూరు డిపోలున్నాయి. నూత నంగా ఇల్లెందు డిపోను నెలకొల్పుతున్నారు. గతంలో ఉదయం డ్యూటీకి ఎక్కితే మధ్యాహ్నానికి దిగేవారు. ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు స్ప్రిట్ డ్యూటీ నిర్వహించాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. రోజుకు 14 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉంటున్నారు. మధ్యలో రెండు గంటలు విశ్రాంతి ఇస్తున్నామని చెబుతున్నా ఏ బస్టాండ్‌లోనూ విశ్రాంతి గదులు లేవు. రూ.25 కోట్లతో నిర్మించిన ఖమ్మం నూతన బస్టాండ్‌లోనూ విశ్రాంతి గదులు లేవు. భోజనశాల కూడా లేదు. మూడ్రోజుల మస్టర్లను ఒక రోజుకు కుదించారు. ఆరురోజులు డ్యూటీ చేస్తే ఏడోరోజు ఆఫ్ ఇస్తున్నారని కార్మికుల ఆరోపణ. ఇటీవల కొత్తగూడెం డిపో పరిశీలనకు వెళ్లిన ఆర్ఎం తిరుపతి, మియాపూర్ (వయా చండ్రుగొండ), మంచిర్యాల సర్వీసులను కుదించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల డ్రైవర్ తగ్గి, మస్టర్ సేవ్ అవుతుందని పేర్కొన్నట్టు సమాచారం.