Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం స్థానంలో మనుధర్మం అమలుకు బీజేపీ ప్రయత్నం
- బానిసయుగం నాటి పరిస్థితులు తెస్తున్న మోడీ సర్కారు
- వచ్చే ఎన్నికల తర్వాత శాసనసభలో కమ్యూనిస్టులుంటారు :నవతెలంగాణతో తమ్మినేని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన దేశానికి, ప్రజలకు ప్రమాదకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడమే లక్ష్యంగా జనచైతన్య యాత్రను చేపడుతున్నామని అన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మం అమలుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని అడ్డుకుంటామనీ చెప్పారు. అభ్యుదయ, ప్రగతిశీల భావాలున్న తెలంగాణలో మతోన్మాద బీజేపీకి తావులేదని అన్నారు. మత రాజకీయాలను ప్రతిఘటించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 17 నుంచి వరంగల్‌లో ప్రారంభం కాబోతున్న జనచైతన్య యాత్ర నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు తమ్మినేని వీరభద్రం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
ఈ యాత్ర ముఖ్యఉద్దేశమేంటీ?
బీజేపీ వల్ల ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పు ఏంటీ?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, మతోన్మాదాన్ని ఎండగట్టడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నాం. ప్రభుత్వ విధానాలతోపాటు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ధోరణులను ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తాం. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, సంక్షేమ పథకాల అమలుల్లో ఉన్న లోపాలను గుర్తు చేస్తాం. అయితే బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. ఈ దేశానికి మనుధర్మమే గొప్పదంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు. సోషలిస్టు, సెక్యులర్ పదాలను కూడా రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ కేంద్ర మంత్రులంటున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. విద్యావైద్యంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. ఈడీ, సీబీఐ, కాగ్, సుప్రీం కోర్టును కూడా అధికార పార్టీకి అనుబంధ సంస్థలుగా వాడుకుంటున్నారు. ఇది దుర్మార్గం. ఏకపక్షంగా చట్టాలను చేస్తున్నారు. విమర్శలు చేస్తే దాడులు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తున్నది. అమెరికాకు అనుకూలంగా విదేశాంగ విధానా న్ని అమలు చేస్తున్నది. ఇవన్నీ ప్రజలకు చెప్తాం.
ప్రజల్ని ఈ యాత్ర ఎలా చైతన్యం చేయనుంది?
బీజేపీ పైకి చెప్పే మాటలు విని ప్రజలు మోసపోతున్నారు. ఆకర్షణకు లోనవుతున్నారు. ఆ మాటల వెనుక నష్టమేంటో ఈ యాత్ర ప్రజలకు వివరిస్తుంది. వాస్తవాలను చెప్పి ప్రజల్లో చైతన్యం పెంపొందిస్తుంది. బీజేపీ చెప్తున్న మాటలు నమ్మిన వారికి ఆ ఆలోచనల నుంచి విముక్తి కల్పిస్తుంది.
బీజేపీతో దేశానికి ప్రమాదం అంటున్నారు... అదెలా?
బీజేపీ మిగతా రాజకీయ పార్టీల్లాంటిది కాదు. నిర్దిష్టమైన సిద్ధాంతం ఆ పార్టీకి ఉన్నది. చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరించాలనీ, కులవ్యవస్థ ఉండాలనీ కోరుకునే పార్టీ అది. బ్రాహ్మణులు ఉన్నత స్థాయిలో ఉండాలనీ, వారి కి శూద్రులు, దళితులు సేవ చేయాలని చెప్తు న్నది. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలంటుంది. చరిత్రను వక్రీకరిస్తుంది. ఆర్యులు ఈ దేశా నికి మూలపురుషులంటూ అబద్ధాన్ని నిజం చేయా లని చూస్తున్నది. బానిస యుగం నాటి పరిస్థి తులను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది దేశానికి ప్రమాదకరం. దీన్నే ప్రజలకు చెప్తాం.
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం అన్యాయం చేస్తున్నది. దాన్ని ప్రజలు ఎందుకు గుర్తించడం లేదు?
నూతన ఆర్థిక విధానాల వల్ల కొన్ని సెక్షన్ల ప్రజలకు మేలు జరుగుతున్నది. 30 ఏండ్లలో ఆర్థిక వ్యవస్థ పెరిగింది. అయితే టాప్ 50 శాతం మందికే మేలు కలిగింది. మిగతా 50 శాతం మందిలో దరిద్రం పెరిగింది. డబ్బు, పదవి చుట్టూ రాజకీయాలున్నాయి. పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మారిపో యాయి. మధ్యతరగతి ప్రజలు పెట్టుబడిదారీ విధానం పట్ల భ్రమల నుంచి బయటికి వస్తున్నారు. వాస్తవాలను వివరించి చెప్పడంలో కమ్యూనిస్టుల్లోనూ లోపాలున్నాయి. ఆర్థిక విషయాలను ప్రచారం చెప్పినట్టుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలసిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. ఇప్పుడు వాటిని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తాం.
బీజేపీ వల్ల రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదమేంటీ?
బీజేపీ పాలనలో లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయి. రాజ్యాంగ మూలాలను ధ్వంసం చేస్తున్నది. ముస్లిం మైనార్టీల పట్ల విద్వేషాలను పెంచు తున్నది. ప్రభుత్వరంగ సంస్థలుంటేనే ప్రజా స్వామ్యం ఫరిడవిల్లుతుంది. కానీ కేంద్రం పబ్లిక్ సెక్టార్‌ను నిర్వీర్యం చేస్తున్నది. కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నది. సామాజిక న్యాయం మృగ్యమవుతున్నది. దళితులు, గిరిజ నులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరి గాయి. కుల నిర్మూలన కోసం కాకుండా కుల వృత్తులను కాపాడేలా కేంద్రం చర్యలు తీసు కుంటున్నది. రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తు న్నది. జీఎస్టీ బకాయిలు రాష్ట్రాలకు రావడం లేదు. బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతున్నాయి. అప్పు తెచ్చుకోవాలన్నా కేంద్రం అనుమతి కావాల్సిన పరిస్థితి. ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, నూతన విద్యా విధానాన్ని తెచ్చింది. ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధం. రాజ్యాంగం డొల్ల అని కేంద్రం చెప్పక నే చెప్తున్నది.
మతాన్ని రాజకీయాలకు మిళితం చేసి బీజేపీ పాలన సాగిస్తున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నది. వీటిని ఎలా ఎదుర్కొంటారు?
బీజేపీ పార్లమెంటరీ ఎత్తుగడల్లోనే అది ఉన్నది. మతచిచ్చు ద్వారా రాజకీయ ప్రయో జనం పొందాలన్నదే వారి విధానం. అందులో భాగంగానే మూడోసారి అధికారంలోకి రావా లని చూస్తున్నది. మతం వ్యక్తిగతం. కానీ ప్రభుత్వమే ఓ మతాన్ని నెత్తిన వేసుకోవడం సరైంది కాదు. అది లౌకిక విలువలను కాల రాయడమే అవుతుంది. బీజేపీ విధానం వల్ల హిందూమతంలో కూడా మెజార్టీ ప్రజలకు మేలు జరగదు. బ్రహ్మణులు, ఉన్నత కులాలకే ప్రయోజనం. కులవ్యవస్థ ఉండాలని చెప్పడం వల్ల శూద్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలు మరింత అణచివేయబడతారు. హిందువుల్లో అతి మైనార్టీలైన అగ్రవర్ణాలకే బీజేపీ ప్రాతి నిధ్యం వహిస్తుంది. కానీ హిందూ మతానికి మేలు చేస్తున్నట్టు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నది. హిందూ ధర్మం వేరు, హిందూత్వ రాజకీయాలు వేరు. ఈ వాస్తవా లను ఈ యాత్ర ద్వారా ప్రజలకు చెప్తాం.
పోరాటాల్లో ముందుండే కమ్యూనిస్టుల గొంతును ప్రజలు ఎందుకు వినట్లేదు. లోపం ఎక్కడుందంటారు?
బీజేపీ మూల సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తగిన కృషి జరగడం లేదు. ఆర్థిక విషయాలను తీసుకెళ్తే సరిపోదు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని, అభ్యుదయ విలువలను ప్రజల్లో తీసుకెళ్లాలి. ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, టీవీ, సినిమాలు, ఇంటర్నెట్ ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యా మ్నాయ సంస్కృతిని విస్తరింపచేయాలి. బీజేపీ భావజాలం ఎంత ప్రమాదకరమో వివరించా లి. ఈ కృషిని ఈ యాత్ర ద్వారా చేపడతాం.
అఖండ భారత్ కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయి కదా? దీనిపై ఏమంటారు?
అఖండ భారత్ అమలుకు సాధ్యం కాని కల. ఎప్పుడూ భారత్ ఒకే రాజ్యం కింద ఉన్న సందర్భం తక్కువ. బ్రిటీష్ వారు వచ్చాక ఏకీకృత రూపం వచ్చింది. సంపదను దోపిడీ చేసేందుకు చేసింది. దాన్ని వ్యతిరేకించి భారత్ ఐక్యతను సాధించింది. అందులో భాగంగానే స్వాతంత్య్రోద్యమం సాగింది. వివిధ మతాలు, భాషలు, ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. కానీ బీజేపీ పాలనలో భిన్నత్వం నాశనమవుతున్నది. ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి అంటున్నది. ఇది దేశానికి ప్రమాదం.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా బీజేపీ గెలుస్తున్నది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు రావడం లేదు.?
ఇటీవల గ్యాస్ ధర పెంపు దారుణం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల పెరుగుతున్నాయని చెప్తున్నారు. రష్యా నుంచి గ్యాస్‌ను తక్కువ ధరకే భారత్ కొంటున్నది. అయినా ఎక్కువ ధరకు అమ్ముతున్నది. ప్రజలపై భారాలు మోపుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాస్‌పై సబ్సిడీని క్రమంగా ఎత్తేసింది. అయితే వీధుల్లోకి వచ్చి ప్రజలు పోరాడ్డం లేదు. కానీ ధరలతో సతమతమవుతున్నారు. 2024లో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుంది. అయితే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలి. అప్పుడే బీజేపీ ఓటమి ఖాయం.
మీ యాత్రతో ప్రజలకు చేరవయ్యే ప్రయత్నం చేస్తున్నారా?
రాష్ట్రంలో నిజాం వ్యతిరేక పోరాటం సాగింది. భూ ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు, అభ్యుదయ, ప్రజాతంత్ర ఉద్యమాలకు తెలంగాణ పురిటిగడ్డ. ఇలాంటి ప్రాంతంలో మతోన్మాద బీజేపీకి తావులేదు. నేడు వామపక్షాలకు ఓట్లు రాకపోయినా ఆ ప్రభావం బలంగా ఉన్నది. రాష్ట్రంలో ఫ్యూడల్ భావజాలం ఉన్నది. మూఢవిశ్వాసాలను ప్రజ లు నమ్ముతారు. ఇంకోవైపు ముస్లిం మైనార్టీలు ఎక్కువున్నారు. మతోన్మాదం వైపు ఆకర్షించేం దుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. ఖమ్మంలో ఇటీవల బీఆర్ఎస్ సభ బీజేపీ ఎదు గుదలను తగ్గించింది. వామపక్షాలు అందులో పాల్గొనడమే ఓ కారణంగా ఉన్నది. ప్రజలకు ఈ విషయాలను చెప్పి ప్రభావం చూపుతాం.
కమ్యూనిస్టులకు పూర్వవైభవం వస్తుందంటారా? శాసనసభలోకి మీ సభ్యులు వెళ్తారా?
తప్పకుండా వస్తుంది. అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలో ఉన్న వైభవం ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. కానీ తెలంగాణ ఆవిర్భావానికి ముందున్న పరిస్థితి వచ్చే అవకాశమున్నది. తెలంగాణ పట్ల మేం తీసుకున్న వైఖరి కొంత బలహీనతకు ఓ కారణం. రాజకీయాలు డబ్బు, ప్రలోభాల మయమైపోయాయి. మునుగోడు ఎన్నికల తర్వాత కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. సీపీఐ(ఎం), బీఆర్ఎస్, ఇతర వామపక్షాలు కలిసుండే అవకాశమున్నది. దీన్ని ఉపయోగిం చుకుని వచ్చే ఎన్నికల్లో శాసనసభలో కమ్యూనిస్టులు అడుగుపెట్టడం ఖాయం. ఈ యాత్ర అందుకు దోహద పడుతుంది.