Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రన్నర్‌గా నిలిచిన బీఎంటీసీ
- జట్లను అభినందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ హకీంపేట ట్రాన్స్పోర్ట్ అకాడమీలో నిర్వహించిన అఖిల భారత ప్రజా రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్లో హర్యానా జట్టు విజయం సాధించింది. రన్నర్‌గా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం ప్రారంభమైన కబడ్డీ టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ పోటీలకు టీఎస్ఆర్టీసీ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థలకు చెందిన 9 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా.. తుది పోరులో హర్యానా రోడ్‌వేస్ స్టేట్ ట్రాన్స్పోర్ట్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ ఫోర్ట్ కార్పొరేషన్ (బి.ఎం.టి.సి) జట్లు తలపడ్డాయి. హర్యానా జట్టు ఛాంపియన్‌గా .. బెంగళూరు జట్టు రన్నర్‌గా పతకాలు అందుకోగా మూడో స్థానంలో మహరాష్ట్ర ఆర్టీసీ జట్టు నిలిచింది. బహుమతి ప్రధాన కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరై మొదట మూడు స్థానాల్లో నిలిచిన హర్యానా (బంగారు), బెంగళూరు (రజతం), మహరాష్ట్ర (కాంస్యం) జట్ల సభ్యులకు ట్రోపీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను బహూకరించి అభినందించారు. టోర్నమెంట్లో పాల్గొన్న టీం సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. ప్రజా రవాణా సంస్థల్లో పని చేసే ఉద్యోగులు క్రీడల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆయా రాష్ట్రాల టీంల మధ్య మంచి వాతావరణంలో జరిగిన ఈ టోర్నమెంట్ క్రీడా స్ఫూర్తిని మరింత రెట్టింపు చేసిందన్నారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ కష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.