Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా వెయిటేజీ ఇవ్వని సర్కారు
- వయోపరిమితి దాటుతుండటంతో ఇబ్బందులు
- ఆదుకోవాలని అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏండ్ల తరబడి వారందించిన సేవలకు తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన చెందుతున్నారు. ఏదో ఒక రోజు ప్రభుత్వ సేవల్లో ఉంటే క్రమబద్దీకర ణకు నోచుకుంటామనే ఆశతో ఇంతకాలం నెట్టు కొచ్చారు. రెగ్యులర్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి భర్తీ విషయానికి వచ్చే సరికి తమను కాదనీ, జూనియర్లకు వెయిటేజీ ఇచ్చే విధంగా షరతులు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పిల్లలు పెద్దవారై కుటుంబ బాధ్యతలు పెరిగి, ఆర్థిక అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్న తమకు జరుగుతున్న అన్యాయం సరి చేయాలని సంబంధిత అధికారులను, మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అందరి నుంచి సానుభూతి పొందారు. న్యాయం చేయాల్సిన అవసరముందనే భరోసా పొందారు. అయినప్పటికీ వెయిటేజీ అంశం తేల్చకపోవడం, మరో వైపు అది న్యాయవివాదంలో చిక్కుకుపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని తలపెట్టింది. 2018 మే నెలలో నిర్వహించిన రాత పరీక్షను 11,952 మంది అభ్యర్థులు రాశారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన వెయిటేజీ అంశం కోర్టుల్లో తేలకపోవడంతో ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడి కాలేదు. వైద్యారోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ తదితర విభాగాల్లో పొరుగు సేవల ప్రాతిపదికన పని చేస్తున్న 439 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు వెయిటేజీ కల్పించడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు 2021లో అను కూలంగా తీర్పునిచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లగా డివిజన్ బెంచ్ వెయిటేజీ ఇవ్వడాన్ని నిరా కరించింది. దీనిపై పొరుగు సేవల అభ్యర్థులు కొంత మంది తమకు వెయిటేజీని కొనసాగించేలా ఆదేశిం చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇప్పటికే 151 మంది ఆ జాబితాలో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో ఆయా స్కీంలలో పని చేస్తున్న వారితో పాటు అవుట్ సోర్సిం గ్ ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. వీరిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న దాదాపు 4 వేల నుంచి 5 వేల మందికి వెయిటేజీ ఇస్తుండగా, పొరుగు సేవల ప్రాతిపదికన ఇస్తున్న వారి విషయంలో వివాదం నెలకొన్నది. 2006, 2008లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నియమించు కుందనీ, ఆ మేరకు తాము సేవలందించామని చెబుతున్నారు. తమ నియామక ప్రక్రియలో ఏమైనా లోపాలుంటే అవి ప్రభుత్వానికి సంబందించినవే తప్ప తమకెలా ఆపాదిస్తారని అభ్యర్థులు ప్రశ్ని స్తున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరి గానే తాము సేవలందించామనీ, కరోనా లాంటి విపత్కర సమయాల్లో ప్రాణాలొడ్డి కరోనా వారియర్లు గా తమను పొగిడారని గుర్తు చేశారు. ఇప్పటికే వయోపరిమితి దాటుతున్న తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.