Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూరాలజీ సంగతేంటి?
- కంటి పరీక్షలకు ఉస్మానియా న్యూరాలజీ డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉదాత్త లక్ష్యంతో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం సర్వత్రా ప్రశంసలను అందుకుంటున్నది. ముఖ్యంగా వృద్ధులు, రోజు వారీ కూలీలు, వికలాంగులు తదితర వర్గాల వారు ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా తమ ఇండ్ల వద్దనే కంటి పరీక్షలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వారికి వెంటనే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తూ, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ రెఫర్ చేస్తూ, శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటే పెద్దాస్పత్రులకు పంపిస్తూ ప్రజలకు ఉపయోగపడుతున్నది. రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని వంద రోజుల్లో విజయవంతం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,500 వందల బృందాలను డాక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అందరూ కంటి వైద్య నిపుణులు లేకపోవడంతో మిగిలిన వారికి శిక్షణ ఇచ్చిన సంగతి విదితమే. కంటి వెలుగు కార్యక్రమం ఇతర ఆరోగ్య సేవల కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా కంటి వెలుగు కార్యక్రమాలను రూపొందించారు. ఆయా బందాల్లో జూనియర్లను తీసుకుంటే ప్రాథమిక పరీక్షలు చేసేందుకు సరిపోతుందని నిర్దారణకు వచ్చారు. టీంలలో పని చేసేందుకు వీలుగా ఆయా ఆస్పత్రుల్లో ఇప్పటికే పని చేస్తున్న వారిని తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి కూడా ఐదుగురు డాక్టర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో నిబంధనలకు అనుగుణంగా ముగ్గురు జూనియర్లను తీసుకోగా, మరో ఇద్దరిని న్యూరో సర్జరీ విభాగంలో పని చేసే సీనియర్ డాక్టర్లను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్యకు తగినట్టు వైద్య సిబ్బంది లేకపోవడం, అందులోనూ కీలకమైన న్యూరో సర్జరీ విభాగంలో 13 మందికిగాను కేవలం నలుగురే ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిలో నుంచి ఇద్దరిని వంద రోజుల కంటి వెలుగు కార్యక్రమానికి పంపించడంతో మిగిలిన సిబ్బంది, జూనియర్లపై పని భారం పడటంతో పాటు రోగులకు ఇబ్బందికరంగా మారినట్టు చెబుతున్నారు. కేవలం ఉస్మానియా నుంచే కాకుండా మిగిలిన ఆస్పత్రుల నుంచి కూడా ఇలా న్యూరో సర్జరీ లాంటి విభాగాల నుంచి పంపించిన వారిని వెనక్కి రప్పించాలనీ, నిబంధనలకు అనుగుణంగా జూనియర్ల సేవలను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా కంటి వెలుగు కార్యక్రమం యధావిధిగా సాఫీగా సాగడంతో పాటు ఆయా ఆస్పత్రుల్లో అందించే సేవలకు విఘాతం కలగకుండా ఉంటుందని భావిస్తున్నారు.