Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 'న్యాక్ ఏ++' గ్రేడు (4 పాయింట్లకు గాను 3.54) సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ లేదా నాక్) గీతం పనితీరును విశ్లేషించి 'ఏ++' గ్రేడును కేటాయించిందని, ఇది ఏడేండ్ల పాటు అమలులో ఉంటుందని ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. భారతదేశంలోని దాదాపు 4,201 ఉన్నత విద్యా సంస్థల్లో కేవలం మూడు శాతానికి మాత్రమే ఈ గ్రేడ్ దక్కినట్టు నాక్ వెబ్సైట్ ద్వారా వెల్లడవుతోందన్నారు. 'న్యాక్ ఏ++' గుర్తింపు పొందిన గీతం మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, ప్రపంచ స్థాయి, సమగ్ర విద్యను అందించడంతో పాటు సమాజానికి దోహ దపడాలనే దాని లక్ష్యానికి కూడా దగ్గరయినట్టు ఉపకులపతి తెలిపారు. ఈ గ్రేడు సాధించడం ద్వారా మరింత స్వయం ప్రతిపత్తిని సమకూర్చే కేటగిరీ-1 హౌదాను కూడా గీతం నిలుపుకుందన్నారు. అకడమిక్స్ వీసీ ప్రొఫెసర్ జయశంకర్ ఈ వారియర్, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ప్రభుతో సహా ఈ ఘనత సాధించిన సిబ్బంది, విద్యార్థులు, ఇతర భాగస్వాములందరికీ ప్రొఫెసర్ దయానంద అభినందనలు తెలియజేశారు. గతంలో, గీతం 2011లో 'నాక్-ఏ' గ్రేడు, 2017 'నాక్-ఏ+' గ్రేడు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.