Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలి
- టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరి సతీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డం దురదృష్టకరమని అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు ప్రతిపాదించిన నిబంధనలు కార్పొరేట్ కాలేజీలు పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉదయం తొమ్మిది నుంచి సాయం త్రం ఐదు గంటల వరకే తరగతులను నిర్వహించాలన్నారు. కానీ కార్పొరేట్ కాలేజీల్లో ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్ల పేరుతో తరగతులు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మాన సిక ఒత్తిడికి గురికావడం వల్లే ఇటీవల సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కార్పొరేట్ కాలేజీలు వ్యాపార దృక్పథంతో విద్యార్థుల మానసిక ఉల్లాసం, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా వ్యవహరించడం సరైం ది కాదన్నారు. విద్యార్థులను మర యంత్రాలుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల రక్తాన్ని ఫీజుల రూపంలో జలగల్లా పీల్చుతున్నాయని చెప్పారు. కార్పొరేట్ కాలేజీల్లో పీఆర్వో విధానాన్ని నిషేధించాలని కోరారు. ఇప్పటికే వచ్చే విద్యాసంవత్సరానికి 70 శాతం వరకు ప్రవేశాలు పూర్తయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కాలేజీలు, నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసిన బడ్జెట్ కాలేజీలు వేర్వేరని అన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్‌లో ర్యాంకులు రాకపోయినా అధైర్య పడొద్దనీ, ఇతర ఉన్నత విద్యావకాశాలుంటాయని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం ఫీజు విధానాన్ని అమలు చేయాలన్నారు. అడ్మిషన్ల విధానం నిబంధనల ప్రకారమే చేపట్టాలని కోరారు. ఇంటర్ బోర్డు నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ కోర్‌కమిటీ సభ్యులు కె బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి తిప్పారెడ్డి, ఎన్సీ పార్థసారధి, నాయకులు డి సుధీర్‌రెడ్డి, ఉస్మాన్, ఉమాశంకర్ పాల్గొన్నారు.