Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపికలో అవకతవకలు : ఆర్డీవో కార్యాలయం ముందు పేదల నిరసన
- ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
- రాస్తారోకో.. ధర్నాతో ఉద్రిక్తత
- రీ సర్వే చేయాలని ఫిర్యాదులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని పేదలు ఆందోళనకు దిగారు. రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట శనివారం జరిగింది. ఉదయం 10 గంటలకే గాంధీనగర్ కాలనీ ప్రజలు పెద్దఎత్తున ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. మిర్యాలగూడ పట్టణ శివారులో 560 డబుల్ బెడ్ రూమ్‌లు జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. మొత్తం 560 ఇండ్లు ఉండగా, 12,436 దరఖాస్తులు వచ్చాయి. వీటిని విచారించి అర్హుల జాబితాను ఎంపిక చేశారు. నిజమైన అర్హులకు జాబితాలో పేరు రాలేదని వారిని కూడా చేర్చాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తిరిగి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని కూడా విచారించి అర్హుల పేర్లను కలిపి డ్రా పద్ధతిన లబ్దిదారుల ఎంపిక చేశారు. అయినా, విచారణ సరిగా చేయలేదని అనర్హులకే అవకాశం ఇచ్చారని పేదలు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే శనివారం పేదలు ఆందోళనకు దిగారు. 14వ వార్డు షాబునగర్ రామనగర్, మూడో వార్డు తాళ్లగడ్డ, సీతారాంపురం, బంగారిగడ్డ, చైతన్యనగర్, ఈదులగూడెం, సుందర్‌నగర్ కాలనీల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దరఖాస్తుల పరిశీలన సమగ్రంగా జరపలేదని, పారదర్శకంగా విచారణ చేయలేదని ఆరోపించారు. దాని కారణంగా జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత అభ్యంతరాలకు బదులు మళ్లీ దరఖాస్తులు స్వీకరించారని, వాటిని సమగ్రంగా పరిశీలించకపోవడంతో అందరి పేర్లు జాబితాలో చేర్చి డ్రా తీశారని తెలిపారు. దాని ఫలితంగా అనర్హులకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. వార్డుల వారీగా లబ్దిదారుల జాబితాలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని, నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ వార్డు శబూనగర్ రాంనగర్ ఏరియాలో పొదిల సుబ్బమ్మ, సిద్దాపురం రాధిక, పళ్ళు సత్యమ్మ, మొహమ్మద్ నసీమా, ఇంజి రమ్య, సబెర పేర్లు డ్రాలో వచ్చాయని, శుక్రవారం రాత్రి ఆర్డీవో కార్యాలయానికి పిలిచి సంతకాలు, ఫొటోలు తీసుకున్నారని, తెల్లారేసరికి తమ పేర్లకు బదులు మరో పేర్లు చేర్చారని ఆరోపించారు. గాంధీనగర్ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేదని వికలాంగులు ఆందోళన చేశారు. బంగారుగడ్డ 29వ వార్డుకు చెందిన భాగ్యలక్ష్మి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు నివారించి ఆమెను ఏరియాస్పత్రికి తరలించారు. 13వ వార్డు రామచంద్రగూడెంలో అదనంగా తీసుకున్న మూడు దరఖాస్తులను డ్రాలో వేయకుండా అధికార పార్టీ నాయకులే తమ వారికి ఇప్పించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 36వ వార్డులో విచారణ సరిగా జరగలేదని అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దరఖాస్తులను రీ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం అవకతవకలు జరిగాయని విచారణ చేయాలని ఫిర్యాదులు చేశారు. నాలుగో వార్డ్ కౌన్సిలర్ చల్ల నాగమ్మ వెంకన్న తమ వార్డులో లబ్దిదారుల ఎంపిక పూర్తిగా అన్యాయంగా జరిగిందని, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎంపిక చేశారని కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ప్రజల ఆందోళనను తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఇన్చార్జి తహసీల్దార్ అనిల్‌కుమార్ ఫిర్యాదులు స్వీకరించి సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట పేదల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వన్ టౌన్ సీఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.