Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుక్రవారం అర్ధరాత్రి నిర్వాసిత గ్రామానికి వచ్చిన పోలీసు బలగాలు
- ఊరంతా పోలీసులు మోహరించి గండి మూసివేత
- ఆడపిల్లలకు పరిహారం ఇవ్వాలని నిరసన
- పోలీసుల దాడిలో గాయపడిన నిర్వాసిత యువతి
నవతెలంగాణ-అక్కన్నపేట
పోలీసుల పహారా మధ్య గౌరవెల్లి ప్రాజెక్టు పను లను శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభించడంతో నిర్వాసితులు తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని ప్రాజెక్టు ప్రదేశానికి అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి చేరుకుని నిర్వాసితులను బయటకు రాకుండా కట్టడి చేశారు. ఊరంతా నిండిపోయిన పోలీసులు ఎక్కడికక్కడా నిర్వాసితులను నిర్బంధించి రెండో గండి మూసివేత పనులు ప్రారంభించారు. కనీసం ఊళ్లోకి నీళ్లు కూడా రాకుండా చేయడం అందరినీ కలచివేసింది. శనివారం ఉదయం భూనిర్వాసితులు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలబోమని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు నిర్వాసితులపై దాడి చేశా రు. ఈ దాడిలో యువతి పెండ్యాల సౌజన్యకు, కొంతమంది మహిళా నిర్వాసితులకు తీవ్ర గాయాల య్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత నిర్వాసితులను అక్రమంగా అరెస్టు చేసి వ్యా న్లో తరలించారు. ప్రస్తుతం నిర్వాసితులు ఏ పోలీసుస్టేషన్లో ఉన్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. గౌర వెల్లి ప్రాజెక్టు పనులను పోలీస్ పహారా మధ్య మొద లుపెట్టారని నిర్వాసితులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఊరంతా పోలీసులతో నిండిపోయారని, ఎక్కడికక్కడా తమను నిర్బంధించి రెండో గండి మూసివేత పనులు ప్రారంభించారన్నారు. కనీసం ఊళ్లోకి నీళ్లు కూడా రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తాము అడ్డుకాదని తమకు పరిహారం చెల్లిస్తే మేమెందుకు అడ్డుకుంటామని తెలిపారు. అందరికీ పరిహారం అందిన తర్వాతే కట్ట పనులు ప్రారంభించాలని ఇప్పటికే ఎమ్మెల్యేకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా పోలీస్ పహారా మధ్య ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని వాపోయారు. తమ భూములు సర్వస్వం కోల్పోయి పదిమంది రైతులకు నీరందుతుందని, తమ భూములను, ఇండ్లను త్యాగం చేశామని, అలాంటి తమకు ప్రభుత్వం న్యా యం చేయకుండా ఇలా పోలీసులను పెట్టి భయ బ్రాంతులకు గురిచేస్తూ ప్రాజెక్టు పనులు చేయడం అన్యాయమన్నారు. దాదాపు వందమంది పెండ్లయిన ఆడపిల్లలకు రావాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కాలయాపన చేస్తూ, పోలీస్ పహారా మధ్య గండి మూసి వేయడం బాధాకరమన్నారు. తమ భూములు గుంజుకొని దిక్కులేనివారిలా ఇలా వెళ్లగొట్టడం మంచిది కాదన్నారు. అన్నింట్లో మహిళలకు సమాన హక్కు అని చెప్పిన ప్రభుత్వాలు ఇలా ఆడపిల్లలకు అన్యాయం చేయడం దారుణమన్నారు. ఆడపిల్లల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. తమ కన్నీటితో ప్రాజెక్టును నింపుతారా అంటూ ప్రశ్నించారు.