Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల్లారా తరలిరండి
- బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశానికి నష్టదాయకం
- ఐక్యపోరాటాలతో వాటిని తిప్పికొడదాం
- సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆన్లైన్ బహిరంగ సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని వక్తలు కోరారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ గళాలను మోడీ సర్కారుపై ఎక్కుపెట్టాలని కోరారు. మోడీ సర్కారు కార్పొరేట్ అనుకూల విధానాలు దేశ భవిష్యత్కే నష్టదాయకమని హెచ్చరించారు. ఐక్యపోరాటాలతో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత నిజమైన దేశభక్తులపై ఉందన్నారు. మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. ఏప్రిల్ ఐదో తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆహ్వానసంఘాన్ని ఏర్పాటు చేశామనీ, దానికి చైర్మెన్‌గా ప్రభాత్ పట్నాయక్ ఉన్నారని తెలిపారు. నాలుగు కేంద్రాల్లో ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వేలాది మంది తరలివచ్చి ఢిల్లీ వీధుల్లో తెలంగాణ పోరాట వారసత్వాన్ని చూపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును అడ్డంపెట్టుకుని పోడు భూములకు పట్టాలివ్వకుండా అడ్డుకుంటున్న తీరును వివరించారు. గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలకు పట్టాలిచ్చి ఇండ్లు కట్టిస్తే బాగుంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కులం, మతం పేరుతో ఉన్మాద చర్యలను ప్రోత్సహిస్తూ బీజేపీ రాజకీయ లబ్ది పొందుతున్నదనీ, వాటికి ప్రయోగశాలలుగా కర్నాటక, తెలంగాణను మార్చాలని చూస్తున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ను చైతన్యపర్చాల్సిన అవసరం సీఐటీయూ, రైతు, వ్యవ సాయ కార్మిక సంఘాలపై ఉందని నొక్కి చెప్పారు. ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల పట్ల మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో ఆహారభద్రతకు 90 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన తీరును వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడు తున్న ఆహార కొరతను ఆసరాగా తీసుకుని లక్షల కోట్ల రూపాయల లాభాలను గడించాలనే ఉద్దేశంతోనే అంబానీ, అదానీ కన్ను వ్యవసాయ రంగంపై పడిందన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం దేశ సంపదను ఈస్టిండియా కంపెనీ దోచుకెళ్తే...ఇప్పుడు నార్తిండియా కంపెనీలు దేశ సంపదను కొల్లగొడుతున్నాయని విమర్శించారు. అంబానీ, అదానీలకు అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయక చట్టాలను తేవాలని చూసిందన్నారు. రైతులు ఐక్యంగా వాటిని తిప్పికొట్టారని కొనియాడారు. అదానీ కార్పొరేట్ కంపెనీల డొల్లతనంపై సెబీ, ఆర్బీఐ సంస్థలు ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని కాపాడుకోవా ల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ.. మోడీ సర్కారు విధానాల వల్ల దేశ సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిప్రదేశాల్లో యూనియన్లు పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేసే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. అప్రెంటిస్, టైంబాండ్ పేరుతో పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే పనిలో బీజేపీ ఉందన్నారు. నిత్యావసరాలు, ఇతర ధరల పెరుగుదలతో కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలనే డిమాండ్ వస్తుంటే...మోడీ సర్కారు మాత్రం రోజుకు రూ.178 వేతనం అయితే చాలు అని చెప్పటం దుర్మార్గమని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనం చేసే కుట్ర జరుగుతున్నదన్నారు. పెట్టుబడికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా కులం, మతం పేరుతో ప్రజలను చీల్చే దుర్మార్గపు కుట్రకు ఆర్ఎస్ఎస్ పూనుకున్నదనీ, దీన్ని పసిగట్టి ప్రజలు ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ..కనీస మద్దతు ధర హామీ చట్టం తీసుకొస్తామని రాతపూర్వకంగా హామీనిచ్చి రైతులను మోడీ సర్కారు నిలువునా మోసం చేసిందని విమర్శించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. పత్తి కొనుగోలు బాధ్యతనుంచి కేంద్రం తప్పుకోవాలని చూస్తున్న దని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే బిల్లును పార్లమెంట్ ముందుకు తేవడం దారుణమన్నారు. సహకార రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుని కార్పొరేట్లకు అప్పగించే పనిలో పడిందని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లు పాసైతే రైతులకు ఉచిత కరెంటు పోయి మీటర్లు వస్తాయన్నారు. ఇప్పుడొస్తున్న రూ.200, 300 ఇంటి కరెంటు బిల్లులు కాస్తా రూ.800, రూ.1000కి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అధ్యక్షవర్గంగా వ్యవహ రించారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.