Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.81.60 లక్షల స్వాహా
- కార్మికులను లూటీ చేస్తున్న వైనం..
- సమగ్ర విచారణకు డిమాండ్
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో దినసరి వేతన కార్మికులను నిలువునా దోచుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఆస్పత్రిలో సుమారు 769మంది కార్మికులకు నెలకు రూ.1.20 కోట్లను వేతనాలుగా గుత్తేదారుకు చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం సుమారు 350 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 410 మంది ఎవరు..? కాగితాలపైనే చూపించి వేతనాలను స్వాహా చేస్తున్నారా అనేది ప్రశ్నగా మారింది. ఇలా గుత్తేదారు నెలకు రూ.81.60 లక్షలు స్వాహా చేస్తున్నట్టు తెలుస్తోంది.
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎంజీఎం ఆస్పత్రిలో అక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఎవరికి వారు దండుకుంటున్నారు. 350 మంది కార్మికుల వేతనాల నుంచి ప్రతినెల కోత పెడుతున్నారు. వీటితో పాటు రూ.12.60 లక్షలు బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, చీపుర్లు, డస్ట్బిన్లు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. అంటే ఇలా ఎంత పెద్ద కుంభకోణమో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కార్మికులు నోరెత్తకుండా ఉండడానికి సూపర్వైజర్లను ఏర్పాటు చేశారు. వీరంతా కార్మికులు ప్రశ్నించకుండా వారిని ఎప్పటికప్పుడు పకడ్బందీగా అడ్డుకుంటుంటారు. అంతేకాదు, సూపర్వైజర్లే ఆసుపత్రిలో గుత్తేదారుకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని తీసుకోవాలన్నా ఈ సూపర్వైజర్ ఆజ్ఞ మేరకే జరుగుతున్నట్టు తెలుస్తుంది. పలువురు కార్మికులు డాక్టర్ల ఇండ్లలో పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోకు ఈ వ్యవహారంలో పాత్ర ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించి తమకు రావాల్సిన వేతనాన్ని పూర్తిస్థాయిలో ఇప్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దినసరి వేతన కార్మికులుగా 769 మంది కార్మికులు ఉన్నట్టు అధికారిక రికార్డులున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం 350 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో 22 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులున్నారు. వీరిలో స్వీపర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పేషంట్ కేర్ అటెండెంట్లు, సెక్యూరిటీ గార్డులున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.15,600 వేతనం. ఇందులో రూ.1000 పీఎఫ్, ఈఎస్ఐ పోగా రూ.14,500 చెల్లించాలి. కానీ రూ.11,000 మాత్రమే చెల్లిస్తున్నారు. దానిలో రూ.3,600 నెలకు చీపుర్లు, బ్లీచింగ్, ఫినాయిల్, డస్ట్‌బిన్స్ పేరిట ఒక్కో కార్మికుని వేతనం నుంచి కోత విధిస్తున్నారు. 769 మంది కార్మికులకు నెలకు రూ.1.20 కోట్ల వేతనాలను సదరు గుత్తేదారుకు ఆస్పత్రి అధికారులు బదిలీ చేస్తుండగా, ఇందులో నెలకు రూ.81.60 లక్షలు గుత్తేదారు స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సామగ్రి పేరిట మరో రూ.12.60 లక్షలు స్వాహా చేయడం గమనార్హం. కాగా, కార్మికులపై సూపర్వైజర్లను పెట్టడంతో వారి అగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ప్రశ్నించకుండా వీరు అడ్డుకుంటున్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడిపోతుందని బెదిరిస్తుండటంతో నోరు మూసుకొని ఎంత వేతనిమిస్తే అంతే వేతనంతో పనిచేస్తున్నారు.
సూపర్వైజర్ల భార్యలకూ వేతనాలు..
సూపర్వైజర్ల భార్యలను దినసరి వేతన కార్మికులుగా పేపర్‌పై చూపించి వేతనాలు తీసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. క్షేత్రస్థాయిలో సూపర్వైజర్ల సతీమణులు పనిచేయకున్నా వేతనాలు మాత్రం తీసుకుంటున్నారు. సూపర్వైజర్ కార్మికులపై పెత్తనం చేస్తారని తెలుస్తుంది. గుత్తేదారుకు బ్రోకర్‌గా వ్యవహరిస్తూ అటు గుత్తేదారుకు, ఇటు డాక్టర్లకు పనులు చక్కపెడతారని సమాచారం. డాక్టర్ల ఇండ్లలోకి దినసరి వేతన కార్మికులను పనులు చేయడానికి ఈ సూపర్వైజర్ పంపుతున్నారు. ఈ విషయాన్ని సదరు కార్మికులు బహిర్గతం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్మికుల గొంతునొక్కడానికి నలుగురు సూపర్వైజర్లను నియమించి గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నియామకాల్లో అవినీతి
ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో 8 మంది దినసరి వేతన కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. వీరంతా రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలు సదరు కాంట్రాక్టు కంపెనీకి చెల్లించినట్టు సమాచారం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేసిన కార్మికులను రోడ్డున పడేసి, వచ్చే కాంట్రాక్టులో మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీనిచ్చినా, వారిని పక్కనపెట్టి లక్షలు ముట్టచెప్పిన వారికే సదరు కాంట్రాక్టర్లు ఉపాధిని కల్పించడం విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు, పలువురు ప్రజాప్రతినిధుల అండతోనే సదరు గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన వ్యక్తులను విధుల్లోకి తీసుకుంటున్నారని, ఈ విషయం ఆస్పత్రి అధికారయంత్రాంగానికి తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలు చూసే ఆర్ఎంఓ ప్రతి పనిలో సురేష్ అనే సూపర్వైజర్ను మాత్రమే సంప్రదిస్తారని తెలుస్తున్నది. ఏదేమైనా ఇంత పెద్ద కుంభకోణం విషయంలో ఆస్పత్రి అధికారయంత్రాంగం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. ప్రజాధనాన్ని యధేచ్ఛగా దోచుకుంటున్నా అధికారులు స్పందించకపోవడంతో దినసరి కార్మికులు దోపిడికి గురవుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలూ భేఖాతర్
కరోనా సమయంలో విధులు నిర్వహించి అనంతరం తొలగించిన పలువురు దినసరి వేతన కార్మికులు వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపిని పలుమార్లు కలిసి మొరపెట్టుకోగా, వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఎంజీఎం సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. సూపరింటెండెంట్, సదరు ఆర్‌ఎంవోకు ఆదేశాలు జారీ చేసినా సదరు సూపర్వైజర్, కాంట్రాక్టర్ ఆ ఆదేశాలను బుట్టదాఖలు చేసి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలు ఇచ్చిన వారినే విధుల్లోకి తీసుకోవడంతో గతంలో విధులు నిర్వహించి తొలగించబడ్డ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.