Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారం కోసమే మతచిచ్చును రెచ్చగొట్టే వ్యూహం
- బీజేపీ ప్రమాదాన్ని కాంగ్రెస్ గుర్తించడం లేదు
- ప్రజలను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం
- నిరుద్యోగులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పనలో విఫలం
- రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కేంద్రం ప్రయత్నం
- హిందూమతం పేరుతో బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలు
- జనచైతన్యయాత్రతో ప్రజలను చైతన్యపరుస్తాం : నవతెలంగాణతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య
ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ సిద్ధాంతంతో దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య చెప్పారు. అధికారం కోసమే మత చిచ్చును రెచ్చగొట్టి రాజకీయంగా బలపడాలని భావిస్తున్నాయని విమర్శించారు. మెజార్టీగా ఉన్న హిందూమతం పేరుతో ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం దేశానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కుర్చీ కోసం తప్ప ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్ గుర్తిం చక పోవడం దురదృష్ట కరమని అన్నారు. మతోన్మాద చర్యలు, ప్రయివేటీకరణ విధానాలు, అప్రజాస్వామిక పద్ధతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, దేశ సమైక్యతను కాపాడుకోవడం కోసమే యాత్ర చేపడుతున్నామని వివరించారు. కేంద్రం అనుసరించే విధానాలు, ప్రజలను మోసం చేస్తున్న పద్ధతులను గుట్టురట్టు చేస్తామన్నారు. ఈనెల 17 నుంచి వరంగల్‌లో ప్రారంభం కాబోతున్న జనచైతన్య యాత్ర నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఎస్ వీరయ్య ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
గిరిజన, ఆదివాసీ ప్రాంతాల నుంచి మీ యాత్ర ప్రారంభమవుతున్నది. వాళ్లకు ఏం చెప్పదలు చుకున్నారు. మీ మాటలను వారు విశ్వసిస్తారా?
దేశ ప్రజల మధ్య సమైక్యతకు ఆర్ఎస్ ఎస్, బీజేపీ ముప్పుగా మారాయి. గిరిజను లంతా హిందు వులేనని వారిమీద హిందూ మతాన్ని బలవం తంగా రుద్దే ప్రయత్నం జరుగుతున్నది. కానీ చరిత్ర చెప్తున్నదేంటీ?. గిరిజనులంటేనే వారికి ఏ మతం లేదు. ఆదివాసీలంటే ప్రకృతిని దైవంగా భావిస్తారు. దేశంలోని కులాలు, మతాలతో వారికి సంబంధం లేదు. హిందూ మతంతో మాకేంటి సంబంధమంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్వయంగా ప్రకటిం చారు. ఆదివాసీలు ఏనాటికి హిందువులు కాదంటున్నారు. కానీ బలవంతంగా హిందూమతం లో చేర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ తీరు భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత్‌లో చిచ్చురేపే ప్రయత్నం. ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనార్టీలు మెజార్టీ మతానికి లొంగి ఉండాలని చెప్తున్నది. లేదంటే హిందూ మతంలో కలవాలం టున్నది. ఇది మతసా మరస్యాన్ని విచ్ఛిన్నం చేసి అశాంతిని పెంచడమే. ఆదివాసీలకు భరోసా ఇవ్వడం మా బాధ్యత. వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారికి నచ్చిన సాంస్కృతిక విలువలను పాటించొచ్చు. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఈ భరోసా సీపీఐ(ఎం) ఇస్తుంది. తరతరాలుగా వారు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. పోడు భూములపై వారికి ప్రభుత్వం హక్కు కల్పించాలి.
ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్లో ఎంపీ సీట్లను గెలిచింది. దీన్ని ఎలా చూడాలి?
సోయం బాపురావు గెలుపు ప్రజలంతా బీజేపీ వైపు రావడం వల్ల కాదు. గిరిజనుల్లో ఒక తెగకు నాయకుడిగా ఉన్న బాపురావును బీజేపీలో చేర్చుకుని గెలిచారు. అది శాశ్వతంగా నిలబడే సీటు కాదు. కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రాతిపదికన గెలిచిన సీటు కాదు. కొంతకాలంగా దుందుడుకు ఘర్షణ వాతావరణాన్ని, ముస్లింలు, హిందువుల మధ్య తగాదాను సృష్టించి భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచిన సీటు. మెజార్టీ ప్రజలు ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాన్ని అంగీకరించి ఎన్నుకున్నది కాదు. ప్రజలు పునరాలోచిస్తున్నారు. భావోద్వేగాలతో ప్రజలు మోసపోయారు. బీజేపీ ధరలు పెంచడాన్ని గమనిస్తున్నారు. బడ్జెట్లో ధరలు పెంచేందుకు నిర్ణయాలు చేసింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నది. ఉపాధి హామీ చట్టానికి నిధులను తగ్గించింది.
బీజేపీ ప్రమాదం గురించి మీరు నిరంతరం చెప్తూనే ఉన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారా?
ఒక వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకునే వరకు, చైతన్యమయ్యే వరకు చెప్పాల్సిన బాధ్యత అభ్యుదయ వాదులు, కమ్యూనిస్టులది. ఒక నిజాన్ని వందసార్లు చెప్పకపోతే అబద్ధాన్నే ప్రజలు నమ్ముతారు అంటూ అంబేద్కర్ చెప్తారు. నిజాన్ని వందసార్లు కాదు వెయ్యి సార్లు చెప్పాలి. అడుగడుగునా ప్రజలను మోసం చేసే ప్రకటనలు వస్తున్నాయి. భ్రమల్లో ఉంచే పద్ధతుల్లో కేంద్రం వ్యవహరిస్తున్నది. ఈ గుట్టునురట్టు చేయాలి. ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ప్రజల సంక్షేమం, సామరస్యం, సమైక్యత, ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం ఈ యాత్ర చేస్తున్నాం. మతపరమైన చిచ్చును ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. ప్రజలపై కేంద్రం మోపుతున్న భారాలను వివరిస్తాం. ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముతున్న తీరును ఎండగడతాం. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి చైతన్య పరచడమే ఈ యాత్ర ఉద్దేశం. అందుకే జనచైతన్య యాత్ర అని పేరు పెట్టాం.
భైంసా వంటి మత ఘర్షణలకు కేంద్రమైన ప్రాంతాల్లో యాత్ర నిర్వహిస్తున్నారు. అలాంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు.?
పార్టీ ఈ యాత్ర సందర్భంగా ఇస్తున్న నినాదాలను చెప్పాను. సమైక్యత, స్నేహభావం, సహజీవనం వంటి అంశాలను ముందుకు తీసుకుపోతాం. మనుషులంతా ఒక్కటే, శ్రామికులంతా ఒక్కటే. మతం మనుషుల మధ్య అడ్డుగోడలు కావొద్దు. ఎవరికి నచ్చిన దేవున్ని వారు పూజిస్తారు. ఎవరికి నచ్చిన మతంలో వారుంటారు. అది వ్యక్తిగతం. దేశం గురించి, ప్రజల సమస్యల గురించి ఆలోచించాలి. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమైక్యంగా స్పందించాలి. ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తెస్తాం. 2024 పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆర్ఎస్ఎస్, బీజేపీ మతవిద్వేషాలను పెంచుతున్నాయి. భైంసా, కరీంనగర్ లాంటి సున్నిత వాతావరణం ఉన్న ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనాలకు కోసం వాడుకుంటున్నాయి. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. వారు ఐక్యంగా పోరాటం చేసేలా చైతన్యం పెంచుతాం. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం హిందూ, ముస్లింలు ఐక్యంగా కొట్లాడుతున్నారు. 2022 డిసెంబర్ నాటికి ఇండ్లు లేని పేదలు దేశంలో ఉండబోరంటూ మోడీ ప్రకటించారు. దాన్ని అమలులో చేయడంలో పూర్తిగా విఫల మయ్యారు. రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షల వరకు ఉన్నాయి. కులమతాల కతీతంగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని మీరు భావిస్తున్నారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు చీల్చుకోవడం వల్ల బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచింది. రాబోయే ఎన్ని కల్లో పోటీని నిలువరించేందుకు మీ విధాన మేంటీ?
లౌకిక శక్తులు కలిపి పనిచేయాలని సీపీఐ, సీపీఐ(ఎం) ఇతర వామపక్షాలు పిలుపునిస్తున్నాయి. బీజేపీ మతోన్మాదం, ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. మోడీతో బీఆర్ఎస్ ఏడేండ్లు లాలూచీ కుస్తీ నడిపింది. దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పాం. బీజేపీ మతోన్మాదం, ప్రయివేటీకరణపై బీఆర్ఎస్ ఇప్పుడు గట్టి వైఖరి తీసుకున్నది. అలాంటి శక్తులతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నది. బీజేపీకి ప్రత్యామ్నాయం మేమే అని కాంగ్రెస్ చెప్తున్నది. కానీ మతోన్మాదం, ప్రయివేటీకరణ, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడదు. రాష్ట్రంలో కుర్చీ ఎలా గుంజుకుందామా? అని ఆలోచిస్తుంది. దేశం ప్రమాదంలో ఉందనీ, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విధానాలపై కాంగ్రెస్ నేతలు సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ప్రమాదాన్ని కాంగ్రెస్ గుర్తించడం లేదు. దీంతో కాంగ్రెస్ వైఖరి బీజేపీకి ప్రయోజనం కలుగుతున్నది. అవకాశవాదాన్ని కాంగ్రెస్ వదలాలి. లౌకికవాదులు, వామపక్షాలు కలిసి ఉద్యమాలు చేస్తే రాష్ట్రంలో ఇలాంటి మతోన్మాదులకు అవకాశముండదు.
బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ బీజేపీ గెలిచేలా అనేక రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తున్నది. దీన్ని ఎదుర్కోవడం ఎలా?
ఈ యాత్రకు ఎన్నికలకు సంబంధం లేదు. ఇది ఎన్నికల కోసం సాగుతున్న యాత్ర కాదు. దేశం కోసం, ప్రజా స్వామ్యం కోసం ప్రజల కోసం సాగుతున్న యాత్ర. అయితే ఎన్నికల ప్రస్తావన వచ్చింది కాబట్టి బీజేపీ ఆ ప్రయత్నం చేస్తున్నది. అనుకూల ఓటును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితి బీజేపీకి అను కూలంగా లేదు. అందుకే వ్యతిరేక ఓటును చీల్చడంపై దృష్టిసారించింది. తెలంగాణలో బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడా బీజేపీని విమర్శించడం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే. కానీ దేశాన్ని ముంచుతున్న బీజేపీని ప్రశ్నించకుండా ఉండటం సరైంది కాదు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బయటికి వస్తు న్నాయి. ఆ పార్టీలన్నీ బీజేపీని ఎలా ఓడించాలనే పనిలో ఉన్నాయి. బీజేపీని ఓడించేందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశముంటుంది. ఎన్నికల తర్వాత కూడా బీజేపీని అధికారంలోకి రాకుండా చూస్తారు. ప్రజలు బీజేపీని నమ్మడం లేదు.
గిరిజన, ఆదివాసీ రిజర్వేషన్ల పెంపును కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందనే విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లను ఎత్తేయాలని ప్రయత్ని స్తున్నది. కుల వివక్షను రూపుమాపడానికి సిద్ధంగా లేదు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపును కేంద్రం తొక్కిపెట్టింది. చిత్తశుద్ధి ఉంటే ఆమోదించాలి. అగ్రవర్ణాలు, బ్రాహ్మణ ఆధిక్యత కొనసాగాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఉండాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. గిరిజనులు, దళితుల అభివృద్ధి వారికి గిట్టదు. అందుకే ఆ బిల్లును ఆమోదించలేదు.
బీజేపీ మతాన్ని ఆయుధంగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది. ఆ ప్రమాదాన్ని ప్రజలకు, యువతకు అర్థమయ్యేలా ఎలా చెప్తారు?
బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలను చేస్తున్నది. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుం టున్నది. మతచిచ్చు పెట్టి మెజార్టీగా ఉన్న హిందు వులను ఓటుబ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని యువత అర్థం చేసుకోవాలి. మతాన్ని వాడుకుని అధికారంలోకి వస్తున్నది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పిం చడం లేదు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తా మంటూ మోడీ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయి వేటుపరం చేస్తున్నారు. యువతకు ఈ విషయా లను అర్థమ య్యేలా చెప్తాం. భైంసా వంటి ప్రాంతాలకు వెళ్లినపుడు ఎంఐఎం కూడా ఓటుబ్యాంకు రాజకీ యాలు చేస్తున్నదని ముస్లిం మైనార్టీ లకు చెప్తాం. మెజార్టీ, మైనార్టీ మతోన్మాద ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి, పేదల ప్రజల మధ్య తంపులు పెట్టేం దుకు ఉపయోగ పడుతున్నాయి. పరస్పరం సహకరిం చుకుంటున్నారు. రెండు మతాల్లోని పేదలు, ప్రజాస్వామ్య వాదులు ఓటు బ్యాంకు రాజకీయాలను అర్థం చేసుకుని తిరస్కరించాలి. ప్రజాస్వామిక విలువలను కాపాడాలి.