Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుధర్మం పొంచిఉంది
- తెలంగాణ సాహితి మహిళా ఫెస్ట్ 'అంతరంగ ఆవిష్కరణ'లో ఆనందాచారి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ, మరోసారి వారిని వంటింటి కుందేళ్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఇలాంటి వాటిపట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కే ఆనందాచారి హెచ్చరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని, మూల రాజ్యాంగం పేరుతో మనుధర్మ శాస్త్రం పేరుతో పరిపాలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నా యని చెప్పారు. మహిళల్లో, సమాజంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా మానవీయ విలువలకు విఘాతం కల్పించి, విభేదాలు సృష్టించే మనువాదాన్ని ఐక్యంగా అడ్డుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో 'అంతరంగ ఆవిష్కరణ' మహిళా ఫెస్ట్ సలీమ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం దొడ్డి కొమురయ్య హాల్ బైరి ఇందిర ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనందాచారి మాట్లాడారు. మనుధర్మ శాస్త్రంలో మహిళలకు స్వేచ్ఛ లేదన్నారు. కుల, మత, వర్ణ, వర్గ వివక్షలతో మనువాదం నిండి ఉంటుందనీ, దీన్ని తిప్పికొట్టడానికి అభ్యుదయ సమాజం అనేక ఆటుపోట్లకు గురైందని వివరించారు. మహిళల 'అంతరంగ ఆవిష్కరణ'ల్లో ఎంతో వేదన, ఎన్నో కథలు దాగున్నాయన్నారు. వీటిని కన్నీళ్ల మధ్యే దాచేసుకోవడం సరికాదనీ, సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మనుధర్మంతో మహిళా సమాజం అంతటికీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనీ, దీన్ని గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఆ దాడిని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రముఖ రచయిత్రి సూర్య ధనుంజయ ప్రారంభోపన్యాసం చేస్తూ 'అంతరంగ ఆవిష్కరణ'...పేరే చాలా గొప్పగా ఉందన్నారు. ''యత్ర నార్యస్తు పూజ్యంతే-రమంతే తత్ర దేవత్ణా'' అన్నంత పూజలు తమకు వద్దనీ, మహిళలూ మనుషులే అని గౌరవిస్తే చాలంటూ తన వ్యక్తిగత జీవిత వైఛిత్య్రాలు, మనోవేదనలను సభికులతో పంచుకున్నారు. ఆకాశం, అవనిలో సగభాగం ఉన్న మహిళలు, అవకాశాల్లో ఎందుకు సగం లేరని ప్రశ్నించారు. 'ఎదిగిన ఎత్తునుంచి కిందికి చూశా...విరిగిన నిచ్చెనలు కనిపించాయి' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. లక్కరాజు నిర్మల మాట్లాడుతూ 'భావాలన్నీ మౌనంగా డైరీలై, నన్ను ఖైదీని చేశాయి' అంటూ తన అంతరంగ అనుభవాలను పంచుకున్నారు. అంతరంగ భావాలకు అక్షరరూపం ఇస్తే మనసులో ఏ బాధ ఉండదనీ, మార్గదర్శకులుగా నిలుస్తా మని విశ్లేషించారు. కార్యక్రమంలో అంతకుముందు ఇటీవల మరణించిన మహిళా కవులు, రచయిత్రులు బైరి ఇందిర, కే రామలక్ష్మి, శోభారాణికి నివాళులర్పించారు. సంతాపంగా మౌనం పాటించారు. ఆహూతులను వేదికపైకి రూపా రుక్ష్మిణి ఆహ్వానించారు. సునీత ఉమాదేవి, తిరునగరి దేవకీదేవి, జూపాక సుభద్ర, తాళ్లపల్లి యాకమ్మ, ఝాన్సీ కొప్పిశెట్టి, ఉరిమళ్ల సునంద, మేరెడ్డి రేఖ, జరీనా బేగం. డాక్టర్ హసీనా తదితరులు పాల్గొన్నారు.