Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీచైతన్య కాలేజీలో చదివే సాత్విక్ అనే విద్యార్థి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మరణించిన విషయం తెలిసిందే. ఈ కాలంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆత్మహత్యల పట్ల విద్యార్థి, యువజన సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) రాష్ట్ర ప్రభుత్వ తీరుతోపాటు ఇంటర్ బోర్డును వ్యతిరేకించాయి. కార్పొరేట్ కాలేజీలను కట్టడి చేయాలనీ, నిబంధనలు పాటించకపోతే గుర్తింపును రద్దు చేయాలనీ డిమాండ్ చేశాయి. కొన్ని సంఘాలు కార్పొరేట్ కాలేజీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలని కోరాయి. అయితే ఈ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారన్నది కీలకంగా మారనున్నది. ఈ సమావేశానికి ఆల్ఫోర్స్, దీక్ష, ఎక్స్లెన్సియా, ఫిట్జీ, గౌతమి, నారాయణ, ప్రగతి, రిజోనెన్స్, ఎస్ఆర్, షాహీన్, శ్రీఆదర్శ్, శ్రీచైతన్య, శ్రీమేధ, తపస్యతోపాటు టీపీజేఎంఏ అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఇంటర్ బోర్డు ఆహ్వానించింది.