Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాన్‌టీచింగ్ సిబ్బందికి కనీసవేతనమివ్వాలి : సీఐటీయూ కోశాధికారి వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే నాన్‌టీచింగ్ సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడు తున్నదని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీబీవీ నాన్‌టీచింగ్ స్టాఫ్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వంగూరు రాములు మాట్లాడుతూ.. వాటిలో ఏడు రకాల పనులు చేస్తున్న సిబ్బందితో రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. నెలకు రూ.9,750 వేతనం ఇస్తే ఎలా బతకాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
పెద్దపెద్ద గిన్నెలలో వండిన వంటలను కిచెన్ నుంచి డైనింగ్ హాల్‌కు తీసుకెళ్లే క్రమంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు సిబ్బందిని నియమించాలనీ, వారాంతపు సెలవులు ఇవ్వాలనీ, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీల్లో పనిచేసే నాన్‌టీచింగ్ సిబ్బంది తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వారి పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేజీబీవీ నాన్‌టీచింగ్ స్టాఫ్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి మాట్లాడుతూ..కేజీబీవీలలో పనిచేసే సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్, గుర్తింపు కార్డులు, ప్రమాదబీమా, బస్సు పాసు సౌకర్యాలను కల్పించాలని కోరారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బదిలీ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి.సాయిలు, తదితరులు పాల్గొన్నారు.