Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డయాలసిస్ సెంటర్, బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-దుబ్బాక
పేద ప్రజల సుస్తీని తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్తీ దవాఖానాలను పేదల దోస్తీ దవాఖానాలుగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి 57 రకాల పరీక్షలు, 154 రకాల మందుల్ని ఉచితంగా అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రిలో కిడ్నీ పేషంట్ల కోసం ''డయాలసిస్ సెంటర్'', డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో ''బస్తీ దవాఖానా''ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. దుబ్బాక ఏరియా ఆస్పత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలనూ ప్రారంభించారు. అనంతరం హెచ్పీ గ్యాస్ గోదాం నుంచి దుంపలపల్లి వరకు నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏరియా వంద పడకల ఆస్పత్రి ప్రారంభ సమయంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కోరిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం ఇచ్చిన హామీ మేరకు మంజూరు చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల పేషెంట్లు గతంలో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్కు పోయేవారని ఇక ఆ సమస్య తీరిందన్నారు. డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పెన్షన్, ఉచిత బస్సు పాసులను అందిస్తున్న ఘనత కేవలం కేసీఆర్ సర్కార్ దేనన్నారు. త్వరలోనే వంద పడకల ఆస్పత్రిలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని వసతులతో కూడిన వెజ్, నాన్-వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్ని వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కాశీనాథ్, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మెన్ శేర్ల కైలాష్, ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, ఏఈ పృథ్వీరాజ్, ఎంపీడీవో భాస్కర శర్మ, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.