Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యతతో ప్రతిఘటనకు సిద్ధం
- ఈనెల 14న చలో హైదరాబాద్ : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ పరిపాలనలో దళితులపై దాడులు రెట్టింపయ్యాయని కుల వవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో 'ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు, ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ఐక్యతతో సామాజిక సంఘాలు ప్రతిఘటనకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యలో ఈ నెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.దేశంలో మతతత్వ ఎజెండాను అమలు చేస్తూ, మరో పక్క దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదని విమర్శించారు. ఇంకో పక్క పేదలపై మోయలేని భారాలు మోపుతున్నదని చెప్పారు. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో దళిత, గిరిజన, మైనార్టీ మహిళలను టార్గెట్‌గా చేసుకుని రెట్టింపు స్థాయిలో దాడులు చేస్తున్నదని తెలిపారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 40,072 దాడులు జరిగితే, 2021 సంవత్సరం నాటికి అవి 50,900 పెరిగాయని గుర్తుచేశారు.ఎస్సీ, ఎస్టీ లైంగిక నిరోధక చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈచట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ఉనికికే ప్రమాదమేర్పడిందని చెప్పారు.
తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలన్నారు. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టే దుర్మార్గాలకు కేంద్రం ఒడిగడుతున్నదనీ, ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, డీబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహ్మ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యాన్ని అందరికీ అందించాలన్నారు. కార్యక్రమంలో బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడమంచి రాంబాబు, తెలంగాణ దళిత దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రమల్ల మోగిలయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రకాశ్కరత్, గంధం మనోహర్, జిల్లా నాయకులు జంగయ్య కుమార్, గంధం నాగరాజు, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారపాక అనిల్, జె ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.