Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
- పస్రా గుడిసెల కేంద్రం సందర్శన
నవతెలంగాణ-గోవిందరావుపేట
మహిళలు తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గుడిసెవాసుల కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం కడారి నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటివారు కీలక పాత్ర పోషించారని అని అన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళలు లేని పోరాటం లేదని అన్నారు. ప్రధానంగా మహిళలకు గృహ అవసరం ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. గూడు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో అనేక కేంద్రాల్లో ఇంటి స్థలాల కోసం మహిళలు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. పస్రాలో 40 రోజులుగా మహిళలు ఇంటి స్థలాల కోసం ఉద్యమించడం అభినందనీయమని కొనియాడారు. మహిళలు చేస్తున్న ఈ పోరాటాలను ప్రభుత్వం గుర్తించి సమస్య పరిష్కారం చూపాలని కోరారు. మహిళా సంఘం సంపూర్ణ మద్దతు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదస్సులో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్, జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబు, గొంది రాజేష్, మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి, గుడిసె వాసుల కమిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.