Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరి, కావేరి తొలిదశలో 140 టీఎంసీల తరలింపు
- తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి రూ.43 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయం
- ఛత్తీస్‌గఢ్‌కు ప్రత్యేక సాయం
- ఎన్‌డబ్ల్యూడీఏ భేటిలో తెలంగాణ,ఏపీ కొత్త ప్రతిపాదనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నదుల అనుసంధానం ప్రక్రియకు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివద్ధి సంస్థ 17వ టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించింది . ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మెన్ భూపాల్‌సింగ్ రాష్ట్రాల అధికారులతోపాటు కేంద్ర శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరే కూడా పాల్గొన్నారు . దేశంలోని ప్రధాన నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు . తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నదుల అనుసంధాన ప్రక్రియపై లేవనెత్తిన పలు సందేహాలకు సమావేశంలో స్పష్టతనిచ్చారు . తొలిదశ కింద గోదావరి, కష్ణా, పెన్నా ,కావేరి నదుల అనుసంధానంపై ఈ భేటిలో మాట్లాడారు . గోదావరి నదిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్న నీటికేటాయింపుల్లో చుక్క నీటిని కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం వినియోగించుకోబోమని ఎన్‌డబ్ల్యూడీ ఏ నుంచి గట్టి హామీ లభించింది . రాష్ట్రానికి కేటాయించిన నీటిలో రాష్ట్రం అధికశాతం నీటిని ఉపయోగించుకోలేకపోవడంతో ఆ నీరంతా వధాగా పోతున్నదని భూపాల్ సింగ్ వివరణ ఇచ్చారు . ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉపయోగించు కోకుండా మిగిలిపోతున్న 141 టిఎంసీలను మాత్రమే తొలిదశ కింద గోదావరి, కావేరి నదుల అనుసంధాన పథకంలో ఉపయోగించనున్నట్టు తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 980 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్రం నుంచి అనుమతి ఇప్పించాలని తెలంగాణ రాష్ట్రం కోరగా , అందుకు కేంద్ర నదుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సీడబ్ల్యూసీతో చర్చించి ప్రాజెక్టుల అనుమతులకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో వెనుకబడిన కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించటంలో ప్రాధాన్యత ఇవ్వాలనీ, నదుల అనుసంధానం ప్రాజెక్టులో వినియోగించే నీటిలో 50 శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరగా , ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం దష్టికి తీసుకుపోతామని తెలిపారు . గోదావరి కావేరి అనుసంధానం కోసం ఇన్‌టేక్ పాయింట్ ఇచ్చంపల్లి వద్ద ఎంపిక చేస్తే ఎగువన మేడిగడ్డకు దిగువన నమ్మక్క బ్యారేజికి సమస్యలు వస్తాయన్న సందేహా లను కూడా తెలంగాణ ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించింది. సాంకేతికంగా సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే,ఉన్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది. లేకుండా ఇన్‌టేక్ పాయింట్లను ఎంపిక చేస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ హామీ ఇచ్చింది .
పోలవరం నుంచి అనుసంధానం చేయ్యండి :ఏపీ
గోదావరి కావేరి నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం దష్టికి తెచ్చింది . పోలవరం కుడి కాలువ నుంచి నీటిని మళ్లీస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి , అటు నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే ప్రతిపాదనను కూడా ఎన్‌డబ్ల్యూడీఏ ముందు పెట్టింది . ఈ ప్రతిపాదనలను కూడా పరిశీలన చేస్తామని నలహాదారు వెదిరే శ్రీరామ్ వెల్లడించారు . ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర పరిధిలోని 141 టీఎంసీల మిగులు జలాలను ఉపయోగించుకోవచ్చనీ, ఆ రాష్ట్రం నుంచి పూర్తి అంగీకారం లభించాకే గోదావరి కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ వెల్లడించింది .
నీటి కేటాయింపులు పున:పంపిణీ
గోదావరి, కావేరి నదుల అనుసంధానం ద్వారా వినియోగించుకునే నీటిలో ఆయా రాష్ట్రాలకు పున:పంపిణీ చేయాలన్న ప్రతిపాదనలకు సమావేశం సానుకూలత వ్యక్తం చేసింది. బేసిన్ పరిధిలో ఉన్న రాష్ట్రాలకే పున:పంపిణీలో ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేందుకు 1:3 దామాషాగా కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రూ.43 వేల కోట్ల అంచనాతో అనుసంధానం
గోదావరి, కావేరి నదుల అనుసంధానికి రూ.43 వేలకోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ సమావేశంలో రాజస్థాన్. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడే పర్భంతిదంబల్ నదుల అనుసంధానంపై కూడా చర్చించారు . వీటికి సంబంధించిన డీపీఆర్ ప్రతులను ఆయా రాష్ట్రాలకు టాస్క్‌ఫోర్స్ సమావేశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి నీటిపారుశాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్ సమావేశానికి హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మెన్ నవీన్‌కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
డ్రిప్ ప్రాజెక్టులకే కేంద్రం అనుమతి
సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకునేందుకు ఇక నుంచి తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంటలు పండించుకునేలా డ్రిప్, స్పింక్లర్ తదితర విధానాలు అమలుచేసే వాటికే అనుమతి ఇచ్చేలా కేంద్ర జలసంఘం విధానాన్ని సవరించనున్నట్టు సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి నదిలో మిగులు జలాలే లేవని జలసంఘం అధ్యయనం ద్వారా తేల్చిందని చెప్పారు. కాగా ప్రతియేటా వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి నదుల అనుసంధానం కోసం 141 టీఎంసీల నీటిని వినియోగించనున్న కారణంగా, ఆ రాష్ట్రం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా లాభం చేకూరే దిశగా ప్రధాని మోడీ ఆ ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నట్టు వివరించారు.