Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాసంగిలో ఆ ప్రాంతాల్లో నీరందని దుస్థితి
- చివరి భూముల్లో ఆరుబట్టిన పైర్లు
- ఆందోళనలో రైతాంగం
నవతెలంగాణ- మొఫిసిల్ యంత్రాగం
యాసంగిలో వరి సాగు అంచనాలకు మించి రికార్డు సృష్టించింది. కానీ.. ఎన్నో ఆశలతో ఉన్న రైతులకు అక్కడక్కడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు ఆయకట్టు పరిధిలోని యాసంగి పంటలకు నీరందించక నిండా మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ దుస్థితి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉంది. ఒక్కోచోట ఒక్కో పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టుదారులు గోస పడుతున్నారు. కాల్వల నిర్వహణలో లోపాలతో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. జలాశయం కట్ట మరమ్మతులు పూర్తైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ఎత్తిపోతలకు మోక్షం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేస్తే.. వరి పొలాలు నీరందడం లేదని అన్నదాతల వేదన వర్ణనాతీతం. పెట్టిన పెట్టుబడులు, పడిన కష్టం వృథాగా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, తక్షణం ఆదుకోవాలని అధికారులును కోరుతున్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
ఎల్లంపల్లి జలాలతో నింపేదెన్నడు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, పెగడపల్లి, మల్యాల, కొడిమ్యాల, బోయినపల్లి, వేములవాడ మండలాల్లో వేలాది ఎకరాల్లో యాసంగి సీజన్‌కుగాను వరి, పలు రకాల ఆరుతడి పంటలు సాగయ్యాయి.
ఎల్లంపల్లి ఎత్తి పోతలతో నారాయ ణపూర్ జలాశ యంలో నీరు నింపి లిప్టు ద్వారా చెరు వులు, కుంట ల్లోకి మళ్లించాల్సి ఉన్నా అధికారులు పట్టిం పులేని ధోరణి లో ఉన్నారన్న ఆరో పణలు వినిపి స్తున్నాయి. నారాయ ణపూర్ ప్రాజెక్టు నింపాల్సి ఉన్నా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా కరీంనగర్ జిల్లా లోని పలు గ్రామాల బావుల్లో భూగర్భ జలాలు అడు గంటి, ఎల్లంపల్లి జలాలు అందక వేలాది ఎకరాల వరి పొలాలు, ఆరుతడి పైరు ఆరుబట్టడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ఎల్లంపల్లి జలాలతో నారాయణపూర్ ప్రాజెక్టు నింపి పంటలకు నీరందించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
సమస్యల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు
ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు సమస్యల్లో చిక్కుకుంది. సాగు నీరు కోసం రైతాంగం తంటాలు పడాల్సి వస్తోంది. బోనకల్ బ్రాంచ్ కెనాల్(బీబీసీ) పరిధిలో నీటి సరఫరా మరింత తగ్గింది. బీబీసీ పరిధిలోని బోనకల్ మండలం ఆళ్లపాడు మేజర్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని క్రమబద్ధీకరించే రెగ్యులేటర్‌ను నిర్మించలేదు. ఫలితంగా నీళ్లు ఇక్కడ ఆగకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతున్నాయి. దాంతో ఇక్కడి పొలాలకు నీరందడం లేదు. నల్లగొండ జిల్లాలో కొన్నిచోట్ల ప్రధాన కాల్వ దెబ్బతినడంతో పాలేరు రిజర్వాయర్‌లో సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయలేకపోతున్నట్టు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్వహణ లోపాలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పంట దెబ్బతినే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పశువులను మేపాల్సి వస్తుంది
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పైరుకు మొదటి దశలోనే నీరు అందకపో వడంతో పశువులను మేపాల్సి వస్తుందని మంచిర్యాల నియోజకవర్గంలోని కడెం చివరి ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. గూడెం లిప్టు ద్వారా పొలాలకు నీరందుతుందనే ఆశతో నాట్లు వేస్తే.. ఇప్పుడు నీరందక బావులు ఎండిపోయే దశకు చేరుకు న్నాయని చివరి ఆయకట్టు రైతులు వాపోతున్నారు. కడెం నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరడం, గూడెం లిఫ్ట్ మోటార్లు తరచూ మొరాయించడం, పైప్లైన్లు పగిలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ దశలో శ్రీరాంసాగర్ నుంచి నీటిని కడెంకు తరలించి ఆయకట్టుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు.
పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాను. ఇప్పటికీ పొలం సరిగా తడువక 20 రోజులవుతోంది. ఇప్పటికే రూ.50 వేల పెట్టుబడి దాటింది. వ్యవసాయ బావి ఉన్నప్పటికీ కాలువలు పారక అందులో నీళ్లు కూడా మిగలడం లేదు. పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అన్యాయం జరగకుండా చూడాలి.
- రావుల ప్రేమ్‌సాగర్, పెద్దంపేట్, హాజీపూర్ మండలం.
జలాశయం నింపి పంటలను కాపాడాలి
నారాయణపూర్ ప్రాజెక్టు నింపి ఎండుతున్న పంటలకు నీరివ్వాలి. జలాశయంపై ఆశలు పెట్టుకునే పంటలు సాగు చేశాం. కట్ట మరమ్మతులు పూర్తి చేసి నెల రోజులు కావస్తున్నా నీరు నింపక జాప్యం జరుగుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల గత వర్షాకాలంలో పంటలు మునిగి నష్టపోయాం. ఇప్పుడు కాలువలకు నీరు వదలక పంటలు ఎండిపోయి మళ్లీ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
- రైతు ఎడవల్లి కిష్టారెడ్డి- చర్లపల్లి(ఎన్)